” మీరు గెలిస్తే..ఏపీ ముఖ్యమంత్రి అయితే.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తారా..?” ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి.. జర్నలిస్ట్ నుంచి వచ్చిన సూటి ప్రశ్న.
” అమరావతిలో అంతా కుంభకోణమే జరిగింది. చంద్రబాబు తన బినామీలకే దోచి పెట్టారు. ఒక వర్గానికే లాభం చేశారు..” ఇదీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానం.
రాజధానిగా అమరావతి ఉంటుందని కానీ..నిర్మాణాలను కొనసాగిస్తామని కానీ.. ఒక్క మాట చెప్పలేదు. దీంతో ఏపీలో మళ్లీ అమరావతిపై వైసీపీ విధానం ఏమీ మారలేదనే చర్చ ఏపీ రాజకీయాల్లో ప్రారంభమయింది.
అమరావతినే రాజధానిగా ఉంటుంది. కావాలంటే.. మేనిఫెస్టోలో పెడతాం..అంటూ.. కొద్ది రోజుల క్రితం.. వైసీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రెస్మీట్లో చెప్పుకొచ్చారు. అమరావతిని మేనిఫెస్టోలో పెట్టడం ఏమిటి..? అన్న చర్చ అప్పుడే ప్రారంభమయింది. అంటే.. వైసీపీలో రెండో ఆలోచనలు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోందని.. తెలుగుదేశం పార్టీ వర్గాలు విమర్శలు కూడా చేశాయి. అయితే.. అమరావతి విషయంలో.. వైసీపీ విధానం… జగన్మోహన్ రెడ్డి విధానం.. మొదటి నుంచి తేడాగానే ఉన్నాయి. ఆయన అమరావతి రాజధానిపై ఏ మాత్రం సుముఖంగా లేరు. కనీసం.. శంకుస్థాపనకు ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించినా రాలేదు. అమరావతి ఎంపికలో కీలకంగా వ్యవహరించిన మాజీ సీఎస్.. ఆ తర్వాత… చంద్రబాబుకు దూరమై.. వైసీపీకి దగ్గర అయితే.. ఆయనతో అమరావతిపై.. ఓ మాదిరి యుద్ధమే చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఇక పుస్తకాలు, సెమినార్లు పెట్టి… పెద్దల పేర్లతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వీరెవరూ.. అమరావతికి భూములిచ్చిన వారు కాదు. కనీసం అమరావతిలో నివాసం ఉండేవారు కాదు. వీరు అమరావతికి వ్యతిరేకంగా పెట్టే సమావేశాల ముందు… భూములిచ్చిన రైతులు నిరసనలు చేసినా వారు పరిగణనలోకి తీసుకోలేదు. అమరావతికి వ్యతిరేకంగా.. గ్రీన్ ట్రిబ్యూనల్లోకేసులు కూడా వేశారు. దీని వెనుక వైసీపీ ఉందన్నది రాజకీయాల గురించి తెలిసిన వారందరూ అంచనా వేసుకోగలిగిన విషయమే.
ఎప్పుడూ అమరావతి గురించి ఏ మాత్రం పాజిటివ్‌గా మాట్లాడని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వ్యతిరేకంగా మాత్రం మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఏమీ లేదని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించరు. ఒక్క ఇటుక కూడా పడలేదని చెబుతూ ఉంటారు. రూ. 50వేల కోట్ల పనులు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అన్ని జిల్లాల నుంచి ప్రజల్ని.. బస్సుల్లో తీసుకెళ్లి చూపిస్తోంది. అయినా జగన్ గుర్తించడానికి సిద్ధపడటం లేదు. అంటే.. ఆయనలో మరో ఆలోచనలు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతుందని.. టీడీపీ నేతలు అంటున్నారు. ఈ కోణంలోనే.. జగన్మోహన్ రెడ్డి.. ఢిల్లీ లో వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే… దొనకొండ ప్రాంతంలో రాజధాని ఉంటుందని గత ఎన్నికలకు ముందు చెప్పుకున్నారు. జగన్ బంధువులు అక్కడ పెద్ద ఎత్తున భూములు కొన్నారు. దొనకొండ చుట్టుపక్కల అప్పట్లో పులివెందుల జనాల హడావుడి చూసి.. అక్కడి ప్రజలు భయపడిపోయారు కూడా. బహుశా.. జగన్… ముఖ్యమంత్రి అయితే. .. రాజధానిని అక్కడికి తరలిస్తారేమో..?