వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ.. జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను… బెయిల్ రద్దు చేయాలన్నంత తీవ్రంగా సీబీఐ వ్యతిరేకిస్తుందని… వైసీపీ నేతలు ఊహించలేకపోయారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్.. అందులో వినిపించిన వాదన.. వైసీపీ వర్గాల్లోనూ టెన్షన్ రేపుతోంది. బెయిల్ రద్దు చేయమని.. చేసే వాదనలా.. ఆ కౌంటర్ ఉండటమే దీనికి కారణం. సాధారణం… విచారణ సంస్థలు వ్యతిరేకిస్తే.. కోర్టులు … వారికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వవు. విచారణ సంస్థలు వ్యతిరేకిస్తున్న కారణంగానే.. చిదంబరం, డీకే శివకుమార్ లాంటి నేతలకు ఇంత వరకూ బెయిల్ దక్కలేదు. ఇప్పుడు సీబీఐ వాదన జగన్మోహన్ రెడ్డి పిటిషన్‌కు వ్యతిరేకంగా ఉండటంతో.. ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌కు వైసీపీ ముఖ్య నేతలు గురవుతున్నారు.
కేసులన్నీ తేలిపోతాయని.. వైసీపీ నేతలు సంబరాలు కూడా చేసుకుంటున్న సమయంలో.. ఒక్క సారిగా సీబీఐ టర్నింగ్ ఇచ్చుకోవడం షాక్ కు గురి చేస్తోంది. అసలు ఎంపీగా ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేయడంతోపాటు ఆధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేయడం వల్లే ఆయన్ను అరెస్టు చేశామని సీబీఐ చెబుతోంది. అరెస్టును సీబీఐ ప్రత్యేక కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్థించాయని కౌంటర్లో పేర్కొన్నారు. హవాలా ద్వారా డబ్బు మళ్లించిన మైనెక్ మెహతా, మరో సాక్షిగా ఉన్న గోపాలకృష్ణన్ మురళిలను.. బెదిరించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కౌంటర్లో చెప్పిన విషయాలన్నీ గతంలో సీబీఐ కోర్టుకు సమర్పించిన ఆధారాలే. ఇప్పుడు మరోసారి కోర్టుకు గుర్తు చేసింది.
జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడే సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలను సీబీఐ చేయడం కచ్చితంగా ప్రభావితమైన అంశమేనన్న చర్చ న్యాయవాద వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు సీఎంగా.. జగన్ .. అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి పదవులు కట్టబెడుతున్నారు. ఈ క్రమంలో.. ఇలాంటి కారణాలు.. దొరికితే చాలన్న అభిప్రాయం న్యాయవాద వర్గాల్లో ఉంది. అలా కాకపోయినా.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించకపోయినా.. ముఖ్యమంత్రి హోదాలో వారం.. వారం కోర్టుకు వెళ్లడం నైతికత కాదు. విలువల గురించి… ఎలుగెత్తి చాటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది.