తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా నియమిస్తే బీఆర్ఎస్ రాజకీయాలు మరో మలుపు తీసుకుంటాయి అనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే సెంటిమెంట్ అస్త్రం కోల్పోయి బీఆర్ఎస్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేస్తూ బీఆర్ఎస్ తనదైన రాజకీయాలు చేస్తోంది. మళ్లీ సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్నా ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. జనాల దృష్టిని ఆకర్షించేందు కోసం ఉద్యమ తరహ సెగ రాజేసేందుకు బీఆర్ఎస్ కు కొత్తదారులేవి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తే దీనిని బీఆర్ఎస్ అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే చంద్రబాబుతో సాన్నిహిత్యాన్ని తెరమీదకు తీసుకొస్తూ రేవంత్ ను తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేస్తోన్న బీఆర్ఎస్…కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమిస్తే వీటన్నింటిని చూపుతూ తెలంగాణపై ఆంధ్రుల పెత్తనం అనే నినాదాన్ని తెరమీదకు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. తద్వారా బీఆర్ఎస్ తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ గవర్నర్ గా నియమిస్తే బలహీనంగా మారుతోన్న బీఆర్ఎస్ కు కొత్త ఊపిరి పోయడమేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.