తెలుగు సినిమాకి కమర్షియల్ పాఠాలు నేర్పిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. సినిమా పేరు తెలియకపోయినా – ‘ఇది రాఘవేంద్రరావు సినిమా’ అని సగటు ప్రేక్షకుడు ఈజీగా చెప్పేసే ఉమ్మడి లక్షణాలు తెరపై చాలా చాలా కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా కథానాయికల్ని అందంగా చూపించడంలోనూ, పాటల్ని మనోహరంగా తెరకెక్కించడంలోనూ ఆయన మార్క్ ప్రత్యేకం. అన్నమయ్యతో ఆయన లోని రెండో కోణం బయటపడింది. ‘భక్తి చిత్రాలు తీయడంలోనూ ఆయన తరవాతే ఎవరైనా’ అని ఘంటాపథంగా చెప్పేయొచ్చు. ఇప్పుడు ఆయన్నుంచి ‘ఓం నమో వేంకటేశాయ’ వస్తోంది. ఈనెల 10న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి దర్శకేంద్రుడితో జరిపిన చిట్ చాట్ ఇది.
* సాధారణంగా మీరు మీడియాతో మాట్లాడ్డానికి ఇష్టపడేవారు కాదు. మీలో ఈ మార్పుకి కారణమేంటి?
– సౌందర్యలహరితో మాట్లాడ్డం నేర్చుకొన్నా కదా? ఇప్పుడు అలవాటైంది. నేను గొప్ప సినిమా తీశాను చూడండి.. అని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఆ సంగతి సినిమా చూసిన జనాలు చెప్పాలి. అందుకే మాట్లాడేవాడ్ని కాదు.
* ఓం నమోని… అన్నమయ్యతో పోలుస్తున్నారు. మరి మీరేమంటారు?
– అన్నమయ్య కంటే డిఫరెంట్ కథ ఇది. హాథీరామ్ బాబా అనే భక్తుడు… స్వామికి ఎందుకు అంత దగ్గరయ్యాడు, ఈ భక్తుడిలోని గొప్పదనం ఏంటి? ప్రపంచంలో ఇంతమంది మహా భక్తులు ఉండగా స్వామి వారు పాచికలు ఆడుకోవడానికి హాథీరామ్నే ఎందుకు ఎంచుకొన్నారు? అనేది చాలా ఆసక్తికరమైన విషయం. దాన్ని ఈ సినిమాలో చూపించాం.
* అన్నమయ్య కూడా ఓ భక్తుడి కథే. ఆ సినిమాకి అన్నమయ్య అని పేరు పెట్టారు, సినిమాకి మాత్రం హాథీరామ్ బాబా పేరు ఎందుకు పెట్టలేదు?
– అన్నమయ్య సినిమా అన్నమయ్య కోణంలోనే సాగుతుంది. నమో వేంకటేశాయ… స్వామి వారి పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నడే కథ. స్వామి తనకు భక్తుడ్ని తానే స్వయంగా ఎంచుకొంటారు. అందుకే ఆ పేరు పెట్టాం.
* హాథీరామ్ బాబా గురించి చరిత్రలో పెద్దగా ఏం లేదు. మరి.. ఆయన కథని సినిమాగా మలచడం ఎలా సాధ్యమైంది?
– చరిత్రలో ఉన్నది తక్కువే. ఉన్నదాన్ని విపులంగా చెప్పాం. ఉదాహరణకు స్వామివారు హాథీరామ్ బాబాతో పాచికలు ఆడేవారు అని ఒక్క వాక్యంలో చెప్పేస్తే.. ఎలా ఆడారు? ఎక్కడ ఆడారు? ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంది? అనేది మేమే ఊహించి, దాన్ని ఓ రంగుల హరివిల్లులా ఆవిష్కరించాం. ఉన్న విషయాన్ని ఎంత డ్రమెటిక్‌గా చెప్పాం అన్నది కూడా ముఖ్యమే. అన్నమయ్యకి వేంకటేశ్వరుడు కనిపించాడన్నది చరిత్రలో లేదు. కానీ.. అన్నమయ్య క్లైమాక్స్‌లో అది చూపించాం. చరిత్రలో లేనిది ఎందుకు తీశారు? అని ఎవ్వరూ అడగలేదు. ఎందుకంటే ఆ సీన్ అంతబాగా పండింది. అలాంటి ఘట్టాలు ఈ చిత్రంలోనూ ఉన్నాయి.
* హాథీరామ్ బాబా పాత్ర కోసం నాగార్జునని ఏం చెప్పి ఒప్పించారు?
– నిజంగానే నాగార్జునని ఒప్పించడం కష్టమైంది. అన్నమయ్యలాంటి సినిమా మరోటి చేయలేం.. అనేవాడు. ఈ కథ వినడానికి కూడా ఇష్టపడలేదు. ఒక్కసారి కథ విన్న తరవాత తన మనసు మారుతుంది అనిపించింది. చివరకు అదే నిజమైంది.
* నాగార్జున నో అంటే… మీ దగ్గర ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
– నాగార్జున నో అంటే ఈ సినిమా చేసేవాళ్లమే కాదు. అలాగని మిగిలిన కథానాయకులెవ్వరూ చేయలేరు అని కూడా కాదు. నాగ్ అంత గొప్పగా చేయలేరు అని. ఎందుకంటే భక్తుడి పాత్ర అంటే ప్రేక్షకులకు నాగార్జునే గుర్తుకు వస్తాడు. ఈ సినిమాలోనూ చాలా గొప్పగా నటించాడు.
* ఈ తరహా చిత్రాలు చేయాలంటే రాఘవేంద్రరావే చేయాలి అనే మార్క్ పడిపోయింది… దీనిపై మీ కామెంట్?
– అది నా అదృష్టం. కాకపోతే.. ఇప్పుడున్న దర్శకులంతా ఇలాంటి కథలు చేయలగరు. నాకంటే బాగా చెప్పగలరు. మనకు పురాణాలు, ఇతిహాసాలు కావల్సినన్ని ఉన్నాయి. కథ గురించి వెదుక్కోవాల్సిన అవసరం లేదు. కాస్త డ్రమెటిక్‌గా చెబితే చాలు. ఆ సత్తా మన దర్శకులందరికీ ఉంది.
* ఇప్పటి సినిమాకి యువ ప్రేక్షకులే మహారాజ పోషకులు. మరి ఇలాంటి చిత్రాలు వాళ్లకు చేరువ అవుతాయా?
– ఇప్పటి కుర్రాళ్లకు భక్తి కూడా ఎక్కువే. చిలుకూరు వెళ్లండి. అక్కడ యువకులే ఎక్కువగా కనిపిస్తారు. మన సంస్కృతినీ, సంప్రదాయాల్నీ కాపాడాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. మనం వాళ్లకు ఏ రూపంలో అందిస్తున్నామన్నదే ప్రధానం.
* రాఘవేంద్రరావుకి ఇదే చివరి సినిమా అంటున్నారు..
– అంతా స్వామి కృప. ఆయన ఎప్పుడు ఎలా నడిపిస్తాడో చెప్పలేను. అన్నమయ్య తరవాత ఏ గుడికి వెళ్లినా.. ‘మా దేవుడి గురించి కూడా ఓ సినిమా తీయండి’ అని అడుగుతున్నారు. అలా నాపై బాధ్యత పెరుగుతోంది. భక్తుడి కథలు ఇక తీయనేమో. ఆ లెక్కన ఓం నమో.. నా ఆఖరి సినిమా కావొచ్చు.
* యూ ట్యూబ్‌లో యువతరానికి దర్శకత్వ పాఠాలు చెబుతున్నారు. దాని వెనుక ఉన్న ఆంత్యర్యం ఏంటి?
– సహాయ దర్శకులు కావాలని ఆశపడి ఫిల్మ్‌నగర్‌లో వాలిపోయే కుర్రవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందరికీ ఇక్కడ చోటు దొరకదు. మన దగ్గర ఆరేడు మంది స్టార్ దర్శకులు ఉన్నారు. మహా అయితే వంద మందికి వాళ్లు అవకాశాలు ఇస్తారేమో. కొత్త దర్శకులు ఓ ట్రూప్తోనే ఇండ్రస్ట్రీలో అడుగుపెడుతున్నారు. వాళ్ల దగ్గర ఎలాగూ చోటు దక్కదు. నా అనుభవాల్ని పంచుకోవడం ద్వారా సహాయ దర్శకుడిగా పనిచేయకపోయినా ఎంతో కొంత అనుభవం గడించవచ్చు. సినిమా గురించి తెలుసుకోవడానికి ఇదే మార్గం అని ఎప్పుడూ చెప్పను. ఇది కూడా ఓ మార్గమే అన్నది నా ఉద్దేశం. నా పాఠాలు విని ఒక్క కుర్రాడు దర్శకుడు అయినా… నా ప్రయత్నం నెరవేరినట్టే.