సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలుగు ప్రజలకు “జేడీ” లక్ష్మీనారాయణ గానే సుపరిచితం. 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఎన్నికల్లో ఓడిపోవడం, ఎన్నికైన కొంతకాలానికి పార్టీకి రాజీనామా చేసి వెళ్లి పోవడం తెలిసిందే. అయితే తాజాగా ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే తాను తిరిగి జనసేన లోకి వస్తానని వ్యాఖ్యలు చేశారు లక్ష్మీనారాయణ. వివరాల్లోకి వెళితే..
పార్టీని వదిలి వెళ్ళేముందు లక్ష్మీనారాయణ చేసిన ప్రధాన ఆరోపణ- పవన్ కళ్యాణ్ లో రాజకీయాల పట్ల సీరియస్ నెస్ కనిపించడం లేదు అని. పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడానికి అంగీకరించిన కొత్తలో, దాన్ని సాకుగా చూపించి పార్ట్ టైం పొలిటీషియన్ గా పవన్ వ్యవహరిస్తున్నందువల్లే తాను పార్టీని విడిపోతున్నా అని లేఖ రాసి పార్టీకి రాజీనామా చేశారు లక్ష్మీనారాయణ. అయితే ఆయన వెళ్ళిపోయే సమయం లో జనసేన వైపు నుండి ఆయనను ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అయితే తాజాగా ఒక టీవీ ఛానల్ డిబేట్లో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జనసేన పార్టీ ప్రస్తుతం చేసిన రాజకీయాలపై సానుకూలంగా స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మెరుగైన ఫలితాలను సాధించడం పట్ల కూడా ఆయన పాజిటివ్ గా మాట్లాడారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ మీద పార్ట్ టైం పాలిటిక్స్ అంటూ ఆయన చేసిన ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. మహారాష్ట్రలో బాల్ థాకరే కేవలం సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ప్రజల ముందుకు వచ్చేవాడని, అయినప్పటికీ ఆ పార్టీ ఎన్నో సంవత్సరాలు పటిష్టంగా ఉందని, క్యాడర్ ని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే పార్ట్ టైం పాలిటిక్స్ అన్న ముద్ర రాదని ఆయన చెప్పారు. తాను చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇస్తున్నట్లుగా మాట్లాడడంతో ఆశ్చర్యపోయిన యాంకర్ “తిరిగి జనసేనలోకి వెళ్లే ఆలోచన ఉందా” అంటూ లక్ష్మీనారాయణను ప్రశ్నించగా ఆయన దానికి నేరుగా స్పందించలేదు. దాంతో తన ప్రశ్న ను కొంత సవరించిన యాంకర్ , ఒకవేళ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆహ్వానిస్తే పార్టీలోకి తిరిగి వెళతారా అని ప్రశ్నించగా అందుకు సానుకూలంగా స్పందించారు జెడి లక్ష్మీనారాయణ. అలాంటిది జరిగితే తప్పకుండా తాను పునర్ ఆలోచిస్తానని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.
మరి డిబేట్ సందర్భంగా వచ్చిన ప్రశ్నకు మాటవరసకు సమాధానమిచ్చాడా లేక నిజంగా జనసేన లోకి తిరిగి రావడానికి లక్ష్మీనారాయణ ఆసక్తికరంగా ఉన్నాడా అన్నది వేచి చూడాలి.