తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా కాపుల్లో వెనుకబడిన వారిని బీసీలుగా గుర్తించాలనే కోరికతో ఆ కులానికి చెందిన నాయకుడు ముద్రగడ పద్మనాభం గర్జన సభను నిర్వహించినప్పుడు, ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నప్పుడు కూడా.. కేవలం కాపు వర్గంనుంచి మాత్రమే కాకుండా.. ఇతర కులాలనుంచి కూడా ఆయన దీక్ష పట్ల కొంత సానుభూతి కనిపించింది. యూనివర్సిల్గా కాకపోవచ్చు గానీ.. తమలో వ్యతిరేకత ఉండేట్లయితే తెదేపా హామీలు ఇచ్చినప్పుడే వ్యతిరేకించి ఉండాలి.. ఇచ్చిన హామీ రాబట్టుకోవడం కోసం పోరాడడం సబబే అని భావించిన ఇతర కులాల వారు కొందరైనా ఉన్నారు. వారి సానుభూతి కూడా ముద్రగడకు లభించింది. అయితే ఇప్పుడు ఆయన తన ఆమరణ దీక్ష విరమణ తర్వాత.. ప్రభుత్వానికి పెద్దగా వ్యవధి ఇవ్వకుండానే.. మళ్లీ ఆమరణ దీక్షకు దిగుతున్నా అంటూ 11న ముహూర్తాన్ని కూడా ప్రకటించేశారు. అయితే ఇవాళ శాసనసభలో గవర్నరు ప్రసంగాన్ని కూడా గమనించిన తరువాత.. అందులో కాపులకు సంబంధించి గవర్నరు ఇచ్చిన హామీలు కూడా చూసిన తర్వాత ఇంకా దీక్షకు దిగితే… ముద్రగడకు తన సొంత కులం నుంచి కూడా ఈసారి సానుభూతి దక్కదేమో అనే అభిప్రాయం కొందరిలో వినిపిస్తోంది.
ముద్రగడ ఫిబ్రవరి తొలిరోజుల్లో చేసిన తన ఆమరణ నిరాహార దీక్షను విరమించడానికి ప్రధానంగా ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు మూడు! ఒకటి- ఏడాదికి వెయ్యి కోట్ల నిధుల్ని కాపు కమిషన్కు ఇవ్వడం (ఈ ఏడాది బడ్జెట్లో 500 కోట్లు ఇచ్చి వచ్చే ఏడాదినుంచి 1000 వంతున ఇస్తాం అని అప్పుడు హామీ ఇచ్చారు). రెండు- కాపుల్ని బీసీల్లో చేర్చడానికి ఏర్పాటుచేసిన మంజునాధ కమిషన్ నివేదిక ఏడు నెలల్లోగా రావాలని కోరడం (దీనికి 9 నెలల వ్యవధి అంటూనే, సూత్రప్రాయంగా ప్రభుత్వం ఓకే చెప్పింది). మూడు- తాను చెప్పిన ఒక వ్యక్తిని కాపు కమిషన్లో సభ్యుడిగా నియమించడం (అప్పుడు దీనికి కూడా ఓకే అన్నారు.) ఆయన ప్రధాన మైన డిమాండ్లకు ఇప్పుడు గవర్నరు ప్రసంగంలోనే జవాబు వచ్చేసింది. నిజానికి ఈసారి 500 వచ్చే ఏడాదినుంచి 1000 కోట్లు అని చెప్పిన సర్కారు… ఈ ఏడాది బడ్జెట్లోనే వెయ్యి కోట్లు ఇవ్వబోతున్నట్లుగా గవర్నర్ ప్రకటించారు. అలాగే 7 నెలల్లోగా మంజునాధ కమిషన్ నివేదిక పూర్తి కావాలని అడిగితే.. 8 నెలల్లోగా పూర్తవుతుందని గవర్నరు చెప్పారు. అంటే ముద్రగడ ప్రధానంగా ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు పూర్తయిపోయినట్లే లెక్క. ఇక మిగిలిన దెల్లా తాను చెప్పిన వ్యక్తికి కాపు కమిషన్లో సభ్యత్వం ఇవ్వాలన్నది మాత్రమే. ఆ సభ్యత్వం గురించి సర్కారు అసలు పట్టించుకోకపోయినా సరే.. ఇక ముద్రగడ చేయగలిగేది ఏమీ ఉండదు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ హామీల తర్వాత కూడా ముద్రగడ దీక్షకు కూర్చుంటే.. ఆయన ఎన్ని మాటలు చెప్పినప్పటికీ.. తాను చెప్పిన వ్యక్తికి కాపు కమిషన్ సభ్యత్వం రాలేదు గనుకనే.. కేవలం అందుకోసమే దీక్ష చేస్తున్నట్లు కలర్ వస్తుంది. ఆయన ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయలేరు అని చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు మాటలనే ప్రజలు నమ్ముతారు. అందుకే ఇన్ని హామీల తర్వాత ఇంకా దీక్ష జరిగితే.. ముద్రగడకు సానుభూతి దక్కకపోవచ్చునని పలువురు అనుకుంటున్నారు.