దర్శకుడు మారుతి బ్రాండ్ వేల్యూ మీద విడుదలవుతోన్న సినిమా ‘బ్రాండ్ బాబు’. ఆల్రెడీ రిలీజైన టీజర్, ట్రైలర్లో మారుతి మార్క్ రైటింగ్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే… టీజర్, ట్రైలర్ చూశాక ప్రేక్షకుల మదిలో మెదిలిన అంశం ఒక్కటే. నాని లేదా శర్వానంద్ ఈ సినిమా చేసుంటే బావుండేదని. నిజానికి, మారుతి కూడా మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయాలని భావించాడట. శర్వానంద్ హీరోగా సినిమా చేస్తే ఎలా వుంటుందని ఆలోచించాడు. మారుతి ఆలోచనకు శర్వానంద్ ఆదిలోని అడ్డుకట్ట వేయడంతో కొత్త హీరో సుమంత్ శైలేంద్ర దగ్గరకు కథ వెళ్ళింది.
‘భలే భలే మగాడివోయ్’ విడుదల తరవాత… ‘మహానుభావుడు’ సినిమా చిత్రీకరణ ప్రారంభమవడానికి ముందు… దర్శకుడు మారుతి అనుకున్న కాన్సెప్టుల్లో ‘బ్రాండ్ బాబు’ ఒకటి. ‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్ తరవాత మారుతి అమెరికా వెళ్ళినప్పుడు ఎన్నారైల బ్రాండ్ పిచ్చి చూసి కాన్సెప్ట్ రెడీ చేశాడు. శర్వానంద్ హీరోగా సినిమా చేయాలని అనుకున్నప్పుడు అతనికి చెప్పాలనుకున్న నాలుగైదు కాన్సెప్టుల్లో ‘బ్రాండ్ బాబు’ వుంది. అయితే… కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ కాకుండా, క్యారెక్టర్/క్యారెక్టరైజేషన్ బేస్డ్ స్టోరీ చెప్పమని మారుతిని శర్వానంద్ అడగటంతో ఈ కథను పక్కన పెట్టేశాడు. అసలు హీరోకి లైన్ కూడా చెప్పలేదట. హీరో కోరిక మేరకు ‘మహానుభావుడు’ సినిమాను తెరపైకి తెచ్చాడు. అదండీ సంగతి! ఒకవేళ శర్వానంద్ సినిమా చేసుంటే ఎలా వుండేదో. కొత్త హీరో సుమంత్ శైలేంద్ర, తెలుగమ్మాయి ఈషా రెబ్బా జంటగా ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మారుతి బ్రాండ్ కాన్సెప్ట్ ఫిలిం ‘బ్రాండ్ బాబు’ ఆగస్టు 3న థియేటర్లలోకి వస్తుంది. చూసేయండి.