ఏపీలో వైకాపా సర్కారుకు ఎలాంటి అడ్డంకులు కలగకపోతే రాజధాని అమరావతి నుంచి విశాఖపట్టణానికి తరలిపోవడం ఖాయంగా కనబడుతోంది. వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరునూరైనా రాజధాని విశాఖపట్టణానికి తరలిపోతుందని, ఎవ్వరూ ఆపలేరని చెబుతుండగా, టీడీపీ, బీజేపీ, అమరావతికి మద్దతు ఇచ్చే ఇతర పార్టీల నాయకులు రాజధాని తరలించడం అంత వీజీ కాదని, తరలింపునకు కేంద్రం, న్యాయస్థానాలు అంగీకరించవని చెబుతున్నారు. ఒకే పార్టీలోని నాయకులు కొందరు ఇందుకు భిన్నంగా మాట్లాడుతుండవచ్చుగాని పార్టీ నాయకత్వాలు మాత్రం అమరావతి వైపునే ఉన్నాయి.
ఇతర పార్టీలను అలా పక్కనుంచితే అధికార వైకాపా, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి రాజధాని అంశం పరువు సమస్యగా, ప్రతిష్టాత్మకంగా మారింది. అమరావతి కాన్సెప్టు, దాని రూపకల్పన, భూసమీకరణ అన్నీ చేసింది చంద్రబాబు నేతృత్వంలోని ఆనాటి టీడీపీ సర్కారు. కాబట్టి సహజంగానే చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు అమరావతి రాజధానిగా ఉండదంటే చాలా బాధేస్తుంది. రాజధాని ప్రాంత రైతులు భూములు ఇచ్చారు కాబట్టి వారి ఆవేదనను కాదనలేం. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌కు రాజధాని తరలింపు నిర్ణయం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయో, సామాజికపరమైన కారణాలు ఉన్నాయో, అవినీతి కారణాలున్నాయో తరువాత సంగతి.
కాని రాజధాని తరలిస్తున్నామని ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమో, ఏదైనా కారణాల వల్ల ఆగిపోతేనో పరువు పోయినట్లుగా ఫీలవుతారు. జగన్‌కు మొండోడు అనే పేరుంది. తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్లు అంటారని ఆయన్ని గురించి విశ్లేషకులు చెబుతుంటారు. కాబట్టి పెద్ద బలమైన అడ్డంకులు వస్తే తప్ప రాజధాని తరలింపు ఆగకపోవచ్చు. జగన్ మూడు రాజధానులు అన్నప్పటినుంచి తీవ్రంగా విరుచుకుపడుతున్న ప్రతిపక్ష నాయకులు ‘ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుతుందా?’ అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తరువాత వచ్చింది వైకాపా ప్రభుత్వమే. అంటే సర్కారు ఒక్కసారే మారింది.
ప్రభుత్వం మారగానే రాజధాని మారుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో వైకాపాయే మళ్లీ సూపర్‌డూపర్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకం ఉందా? దాన్ని గురించి ఇప్పుడే ఎవ్వరూ చెప్పలేరు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మారుతుందా? అనే ప్రతిపక్షాల వ్యాఖ్యలకు వైకాపా నాయకులు కౌంటర్ ఇస్తూ ఇక ప్రభుత్వం మారే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈమధ్య ఓ నాయకుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లోనూ వైకాపా గెలిచి జగన్ ముఖ్యమంత్రి అవుతారని, కాబట్టి విశాఖ నుంచి రాజధాని ఇక మారదని అన్నాడు.
దీనికి టీడీపీ నాయకులు కౌంటర్ ఇస్తూ వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓడిపోవడం ఖాయమని, రాజధాని మార్పుతో తన ఓటమికి పునాదులు వేసుకున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ‘ప్రభుత్వం మారితే రాజధాని మారుతుంది’ అని చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీయే అధికారంలోకి వస్తుందని, రాజధాని జనం బాధపడాల్సిన అవసరం లేదన్నాడు. ఎందుకు? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి కాగానే రాజధానిని అమరావతికి మారుస్తామన్నాడు. రాజధాని తరలిపోయినా ఇప్పుడున్న అమరావతి ప్రాంతం వచ్చే ఎన్నికలనాటికి కూడా యధాతథంగా రూపురేఖలేమీ మారకుండా అలాగే ఉంటుందని చంద్రమోహన్ రెడ్డి అనుకుంటున్నాడా?
అసలు అమరావతి నుంచి రాజధాని తరలిపోదనే గట్టి నమ్మకాన్ని కూడా చంద్రమోహన్ రెడ్డి వ్యక్తం చేశాడు. ఇంత నమ్మకం ఎందుకు? ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు కాబట్టి తరలిపోదన్నాడు. రాజధాని తరలించాలంటే జగన్ తాతలు దిగిరావాలన్నాడు. కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ అడ్డుకుంటాయని కూడా చెప్పాడు. ఒకవేళ రాజధాని తరలిపోయినా టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతికి తీసుకొస్తారట…!