‘మా పార్టీ సమాచారం తీసుకెళ్లి వైకాపాకు ఇవ్వడానికి మధ్యలో కేసీఆర్ ఎవర’ని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇలాంటి పనికి పాల్పడటం వారి అహంభావానికి సాక్ష్యమన్నారు. చేసిన తప్పును సమర్థించుకునేందుకు ఏపీ ప్రభుత్వం సమాచారం పోయిందంటూ చెబుతున్నారనీ, ‘మా ప్రభుత్వ సమాచారం పోయిందని చెప్పడానికి మీరెవర’నీ, ‘మా సమాచారం పోలేదని మేం చెబుతున్నామ’ని సీఎం అన్నారు. ఈ రాష్ట్రం మీద అంత ప్రేమే ఉంటే విద్యుత్ తీసుకుని రూ. 5 వేల కోట్లు ఏపీకి ఇవ్వాల్సి ఉందనీ, అవి ఇవ్వలేదనీ, పోలవరం మీద ఎందుకు కోర్టుకు వెళ్లారంటూ తెలంగాణ సీఎంను ప్రశ్నించారు. ఇక్కడి ప్రతిపక్షం ఇలాంటివి ఎందుకు అడగదన్నారు.
తెరాస, వైకాపా, భాజపా.. ఈ ముగ్గురూ కలిసి సిగ్గుకూడా పడకుండా కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. ‘ఆయనొస్తే నేను ఓడిపోతా అంటూ కేసీఆర్ బెదిరిస్తున్నారు, నేను ఓడిపోతే నీకు ఇక్కడ సామంత రాజ్యం కావాలి. ఆ సామంత రాజ్యం ఎవరిస్తారు… జగన్ ఇస్తారు. ఎందుకంటే, ఆయనపై అవినీతి ఆరోపణలున్నాయి కాబట్టి, కోర్టులకు వెళ్లాలి కాబట్టి. ఈ రాష్ట్రంతో నీకు ఉన్న సంబంధమేంటి? హక్కేంటి?’ అంటూ కేసీఆర్ ని ఉద్దేశించి మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ ఉంది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేశామనీ, ఏపీలో ఏ సంబంధం లేకపోయినా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ అంటున్నారని విమర్శించారు.
జగన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికారం లేకపోతేనే ఇన్ని దౌర్జన్యాలూ అరాచకాలూ చేసేవాళ్లతో రేప్పొద్దున ప్రజలకు ఎలాంటి రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. తప్పుడు పనులకు పార్టీ కార్యకర్తలను ఉపయోగించుకోవడం సరికాదన్నారు. జైళ్లకు తీసుకెళ్లడం వీళ్లకి అలవాటనీ, ఇంతకుముందు ఆఫీసర్లనీ పారిశ్రామికవేత్తల్నీ తీసుకెళ్లారనీ ఎద్దేవా చేశారు. ఓట్ల తొలగింపు ఫిర్యాదులు చెయ్యడాన్ని తాను తప్పుబట్టడం లేదనీ, తిరిగి వాళ్లే ఆ నేరానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటి పనులు కరుడుగట్టిన నేరస్థులు తప్ప ఎవ్వరూ చెయ్యలేరన్నారు. ఇప్పుడు వీళ్లు చేస్తున్నది శిక్షార్హమైన నేరమనీ, కోర్టుకు వెళ్లి శిక్షపడే వరకూ వదిలిపెట్టమన్నారు.
డాటా చోరీ వ్యవహారంతో వైకాపా, తెరాసల రాజకీయ లక్ష్యం ఏంటనేది వివరించే ప్రయత్నం చేశారు సీఎం. కేసీఆర్ ఆడినట్టుగా జగన్ ఆడుతున్నారనీ, జగన్ ను అడ్డం పెట్టుకుని ఆంధ్రా రాజకీయాలను చేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారనే అంశాన్ని ప్రముఖంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే అంశాన్ని రాబోయే ఎన్నికల్లో ఒక ప్రధాన ప్రచారాంశంగా ప్రజల్లోకి టీడీపీ తీసుకెళ్లే అవకాశాలున్నాయి.