ఒక విజయం సాధించేవరకు ఒంటరి పోరాటం చేయకతప్పని పరిస్థితులు భారత్ లో ఎప్పుడూ ఉంటాయి. కానీ ఒకసారి విజయం సాధించిన తరువాత వారిని జనం ఒంటరిగా ఉండనివ్వరు. నెత్తిన పెట్టుకొని మోస్తారు. అంతవరకు వారికి ఎటువంటి ప్రోత్సాహం, సహాయసహకారాలు అందించని ప్రభుత్వాలు పోటీలు పడి వారికి బహుమానాలు ప్రకటిస్తాయి. వీలైతే వారిని, తద్వారా వారు సాధించిన ఘనవిజయాన్ని కూడా స్వంతం చేసుకోవడానికి పోటీలు పడతాయి. ఒలింపిక్స్ లో వెండి, కాంస్య పతకాలు సాధించిన పివి సింధు, సాక్షి మాలిక్ లే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సింధూని అభినందిస్తూ ఏపి సిఎం చంద్రబాబు, “1995-2004 మధ్య నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రీడల ప్రాధాన్యత గుర్తించి హైదరాబాద్ లో అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని నిర్మించి గోపీ చంద్ కి ఇచ్చాను. అతని శిక్షణలో అద్భుతమైన క్రీడాకారులు తయారవుతున్నారు వారిలో సిందూ కూడా ఒకరు. భవిష్యత్ అవసరాలని నేను ముందే గుర్తించగలిగాను కనుకనే ఆనాడే క్రీడలని ప్రోత్సహించాను,” అని చెప్పారు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే సింధూ విజయానికి పరోక్షంగా తాను కారకుడినేనని గొప్పలు చెప్పుకోవడమేనని స్పష్టం అవుతోంది. చంద్రబాబు ఈ బలహీనతని ఎన్నటికీ బయటపడలేరేమో?
వెండి పతకం సాధించినందుకు చంద్రబాబు ఆమెకి బారీ బహుమానాలు ప్రకటించారు. రూ.3 కోట్లు నగదు, అమరావతిలో 1,000 గజాల స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆమెతో బాటు ఆమెకి శిక్షణ ఇచ్చిన గోపీ చంద్ కి రూ.50 లక్షలు బహుమానం ప్రకటించారు. సాక్షి మాలిక్ కి కూడా రూ.50లక్షల బహుమానం ప్రకటించారు. తెలంగాణా ప్రభుత్వం కోటి రూపాయలు, డిల్లీ ప్రభుత్వం రూ.2కోట్లు, భారత బ్యాడ్మింటన్ సమాఖ్య రూ. 50 లక్షలు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షలు సింధూకి బహుమానం ప్రకటించాయి.
విజయం సాధించిన తరువాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈవిధంగా బహుమానాలు ప్రకటించడం చాలా సాధారణమైన విషయమే. కానీ ఇదే ప్రోత్సాహం క్రీడాకారులకి ముందే ఇచ్చి ఉండి ఉంటే, అప్పుడు దీనికి పదింతలు ఫలితాలు వచ్చి ఉండేవి కదా? ఇప్పుడు సింధూ, సాక్షి పతకాలు సాధించారు గనుక వారి ప్రతిభని అందరూ గుర్తించి ఆకాశానికి ఎత్తేస్తున్నారు కానీ అంతకు ముందు వారిని ఎందుకు గుర్తించలేకపోయాయి. మట్టిలో మాణిక్యాలనదగ్గ అటువంటి క్రీడాకారులని నేటికీ ఎందుకు గుర్తించి, ప్రోత్సహించడం లేదు? కొద్దిపాటి ప్రోత్సాహమిస్తేనే ఇంత అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి.
అదే పూర్తి స్థాయిలో క్రీడాకారులని ప్రోత్సహిస్తే ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు కదా..అని ఆలోచించాలి. కనుక కనీసం ఇప్పటి నుంచైనా కళాశాల స్థాయి నుంచే క్రీడలకి ప్రాధాన్యతనిచ్చి ప్రతిభగల విద్యార్ధులని గుర్తించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అనేక మంది సింధూలు, సాక్షి మాలిక్ లు దొరుకుతారు మనకి.