వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కు ప్రధాన కారణంగా కేంద్రం… చూపిస్తున్న అంశం… ఎన్నికల ఖర్చు. పది వేల కోట్లు ఖర్చయిపోతున్నాయని.. పదే పదే ఎన్నికలతో పాలనకు ఆటంకాలు వస్తున్నాయని చెబుతోంది. అభివృద్ధి పనులు జరగడం లేదని కేంద్రం వాదన. కానీ నిశితంగా పరిశీలిస్తే ఎన్నికల వల్ల సమాజానికి.. దేశానికి ఎంతో మేలు జరుగుతోంది. ఎన్నికలు లేకపోతే.. చాలా వరకూ నష్టపోయే వ్యాపారాలు ఉన్నాయి.
రాజకీయం మీద ఆధారపడిన వ్యాపారాలెన్నో ?
ఒక్క సారి ఎన్నికలు వస్తున్నాయంటే… ఎన్నో వ్యాపారాలు యాక్టివ్ అవుతాయి. డిజిటల్ మీడియా దగ్గర నుంచి జెండాలు తయారు చేసే వరకూ.. అలాగే.. అడ్డాకూలీల వరకూ అందరికీ పని లభిస్తుంది. ఎలక్షన్లు వస్తే.. నిరుపేదలకూ అది సీజనే. ఓ రకంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు.. ఆర్థిక వ్యవహారాలు జరగడానికి ఎన్నికలు కారణం అవుతాయి. ఇటీవలి కాలంలో ఎన్నికల కోసం పనిచేసే వ్యవస్థ విస్తృతం అయింది. ఓ రకంగా పరిశ్రమలాగా మారింది. ఐదేళ్లకోసారి మాత్రమే ఎన్నికలంటే వాటి పరిస్థితి ఏం కావాలి ?
రాజకీయ అవినీతి సొమ్ము బయటకొచ్చేది ఎన్నికల ద్వారానే !
మన దేశంలో వనరుల దోపిడీ ద్వారా… ప్రజలను దోపిడీ చేయడం ద్వారా.. అవినీతి ద్వారా రాజకీయ నేతలు వెనకేస్తున్న సొమ్ములు లక్షల కోట్లలోనే ఉంటాయి. చాలా మంది రాజకీయ నేతలు తాము అవినీతి పరగా సంపాదించి… ఎన్నికల్లో ఖర్చు పెడుతూంటారు . ఏదో ఓ సందర్భంలో రావడం వల్ల తమ అవినీతి సొమ్మును ఖర్చు చేస్తూంటారు. అదే ఎలాంటి ఖర్చు అవసరం లేకపోతే దాచి పెట్టుకుంటారు కానీ…. అవినీతి చేయడం ఆపేయరు. ఎందుకంటే… మన రాజకీయ నేతల్లో దోచుకోని వారు అంటూ ఎవరూ లేరు. కానీ కొంత మంది రాజకీయ అవినీతి చేసి రాజకయానికే ఖర్చు చేస్తారు. కొంత మంది వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటారు. ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోతే అందరూ దాచుకుంటారు.
జమిలీ ఎన్నికలకు ఖర్చు సాకు మాత్రమే
నిజానికి దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ వల్లే అయ్యే ఖర్చు పది వేల కోట్లు మాత్రమే . అది ప్రభుత్వం పెట్టే ఖర్చు . కానీ రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు దానికి కొన్ని వందలరెట్లు ఉంటుంది. ఒక్క తెలంగాణ లేదా ఏపీ రాష్ట్రంలోనే రాజకీయ పార్టీలు అనధికారికంగా పెట్టే ఖర్చు వేల కోట్లలోనే ఉంటుంది. అభ్యర్థులందరూ ఓట్లు కొనేందుకూ డబ్బులు ఉపయోగిస్తారు. వరుసగా ఏదో ఓ ఎన్నిక రాకపోతే ఈ డబ్బులన్నీ గుప్తంగా ఉండిపోతాయి.