ఏపీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అన్ని పార్టీలు అభ్యర్థుల్నిప్రకటించేశాయి. ఏపీలో పోటీకి అవకాశం దక్కని మిగతా అందరి అభ్యర్థుల కన్నా.. ఒక్క పేరే హైలెట్ అవుతోంది. అదే రఘురామకృష్ణరాజు. ఏపీలో జగన్ ప్రభుత్వంపై ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో ఆయన ఒకరు. అందులో సందేహం లేదు. వైసీపీ పార్టీ తరపునే గెలిచినప్పటికీ ఆయన జగన్పై చేసిన పోరాటం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆందుకే ఆయనను నియోజకవర్గంలో కూడా పర్యటించకుండా కట్టడి చేశారు. ఈ కారణంగా నాలుగేళ్ల పాటు ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా ఆయనపై ప్రజల్లో ఆగ్రహం లేదు. ఆయన పోరాటాన్ని అర్థం చేసుకున్నారు. మళ్లీ నర్సాపురం నుంచే పోటీ చేస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. పొత్తులంటూ లేకపోతే ఆయనకు సమస్య ఉండేది కాదేమో కానీ పొత్తులు పెట్టుకోవడం.. మూడు పార్టీల తరపున ఒకే అభ్యర్థిని నిలబెట్టాల్సి రావడంతోనే అసలు రాజకీయం ప్రారంభమయిది. ఆయనకు సీటు రాలేదు.
నర్సాపురంలో ఆయన కంటే.. బలమైన అభ్యర్థి కూటమి తరపున ఎవరూ ఉండరు. కానీ బీజేపీ శ్రీనివాసవర్మ అనే అనామక లీడర్కు అవకాశం ఇచ్చారు. ఆయన స్థానిక సంస్థల్లో అయినా పోటీ చేసి తన సత్తా చాటారా అంటే అలాంటిదేమీ లేదు. ఏ విధంగా చూసినా ఆయన బలమైన నేత కాదు. మరి రఘురామకు ఎందుకు చాన్సివ్వలేదు ?. రఘరామ ఆరోపిస్తున్నట్లుగా… జగన్ ప్రాబల్యం పని చేసిఉంటే.. అది ఖచ్చితంగా కూటమికి నైతిక పరాజయమే. జగన్కు విజయమే. బీజేపీ అంతర్గత రాజకీయాల కారణంగా ఇవ్వలేకపోతే .. అది కూటమి ప్రయోజనాలను దెబ్బకొట్టినట్లే.
ఎలా చూసినా రఘురామను నర్సాపురం నుంచి నిలబెట్టడం అన్నది వంద శాతం కరెక్ట్ స్ట్రాటజీ. కానీ తప్పు జరిగిపోయింది. దిద్దుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.