ఈ ప్రశ్న అందరిలోనూ ఎప్పటినుంచో మెదులుతోంది. నిజమే. అక్కడే ఎందుకు కట్టాలి. వేరే చోట కట్టుకోకూడదా. ఈ ప్రశ్నకు సమాధానం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ద్వారా లభించింది. సాక్షి కెఎస్ఆర్ లైవ్ షోలో మాట్లాడుతున్నప్పుడు ఆయనన్న మాటలు దీనికి పునాది. 217 చదరపు కిలోమీటర్ల పరిథిలోనే రాజధాని ఉంటుంది. అక్కడే ఉండాలని లేదు. రాజధాని కోసం సేకరించిన 33వేల ఎకరాలలో ఎక్కడైనా నిర్మించవచ్చునని ఆర్కే అంటున్నారు. ఆర్కే ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఆయన మాటలు ప్రామాణికమెలా అవుతాయని సందేహం రావచ్చు. వచ్చినా తప్పులేదు. ప్రాథమికంగా ఆయన రాజధాని ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే. అధికారపక్షంపై గట్టిగా పోరాడుతున్న యువనాయకుడు. పైగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంతరంగికుడు కూడా. ఓటుకు నోట్లు కేసులో ఇంప్లీడ్ అవ్వడమే కాక, సుప్రీం కోర్టు దాకా ఈ అంశాన్ని తీసుకెళ్ళిన వ్యక్తి. అలాంటి ఎమ్మెల్యే నోటి వెంట రాజధాని అక్కడే ఉంటుంది కానీ… ప్రస్తుత ప్రాంతంలో ఉండవనడం సందేహాలను రేకె్త్తిస్తోంది. ఒకవేళ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే.. ఇప్పుడు పెడుతున్న ఖర్చంతా వృధాయేనా అనే అనుమానం కలుగక మానదు. ఇంత కీలకమైన విషయాలు యధాలాప చర్చలలో అలాఅలా బయటపడిపోతుంటాయన్నమాట.
210 కోట్ల రూపాలయతో కట్టిన సచివాలయ భవన ప్రస్తుత దుస్థితి ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం కాకపోవచ్చు. ముందు నుంచీ ఆ ఆలోచన ఉండి ఉండవచ్చు. అసలు టీడీపీ అధికారంలోకి రాకపోయుంటే రాజధాని దొనకొండ తరలిపోయుండేది. అక్కడ రాజధాని నిర్మాణానికి వీలుగా శివరామకృష్ణన్ నివేదికను దృష్టిలో ఉంచుకుని అప్పట్లో డీ ఫారెస్ట్రేషన్ కోసం ఉత్తర్వులు జారీ అయిపోయిన విషయం కూడా ఎంతమందికి తెలుసు? ఆ ప్రాంతంలో ఒక సామాజిక వర్గీయులు వెల్లువలా భూములు కొనుగోలు చేసేసింది ఆ ఆశతోనే. సాధారణంగా ఒక నిర్మాణానికి టెండర్ వేస్తేనే అందులో `అన్ని` ఖర్చులూ వేసేసుకుని సమర్పిస్తారు. అందజేయాల్సిన కమిషన్లు.. వీరికి రావాల్సిన లాభాలూ అన్నీ ఉంటాయి. అందుకే పది రూపాయలతో పూర్తికావాల్సిన నిర్మాణాలు వంద రూపాయలు ఖర్చయినా కొలిక్కిరావు. వాటికి ధరల పెరుగుదలంటూ సాకు చూపుతారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణం తీరూ అలాగే ఉంది. 2019లో జగన్ ముఖ్యమంత్రయితే.. రాజధాని నిర్మాణ ప్రక్రియ మళ్ళీ మొదటి వచ్చినట్లేనని ఆర్కే మాటల సారాంశం. ఇది ఎంతవరకూ నిజమో తెలుసుకోవాలంటే వచ్చే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి