కృష్ణాగోదావరి బెసిన్ లో గ్యాస్ పైప్ లైన్లు బలహీనమై తరచు గ్యాస్ పైప్ లైన్లు తరచు లీకవుతున్నాయి. ! కోనసీమలో రెండురోజుల నాటి లీకేజితో కలిపి గ్యాస్ కలిపి గత మూడునెలల్లో 8 చోట్ల గ్యాస్ లీకయింది. రెండేళ్ళక్రితం కోనసీమలో లీకైన గ్యాస్ అంటుకుని 14 మందిని సజీవ దహనంచేసింది.
ప్రజల్ని విపరీతమైన భయాందోళనలకు లోను చేస్తున్న గ్యాస్ లీకేజీలకు రైతుల తెలియని తనం లేదా బాధ్యతా రాహిత్యాలే మూలం కావడం విశేషం!
భూమిలో పాతిపెట్టిన లైన్ల నుంచి గ్యాస్ పంపుతారు. ఈ పైప్ లైన్లు 8 మిల్లీమీటర్ల మందం. 4 అంగుళాల వ్యాసంతో వుంటాయి. పైపుల్ని పాతిపెట్టినందుకు ఒఎన్ జిసి (ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కంపెనీ) భూమి యజమానులకు డబ్బు చెల్లించి ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. ఆ అగ్రిమెంటు ప్రకారం పైప్ లైన్ కి అటూ ఇటూ ఆరేసి అడుగుల దూరంలో ఎలాంటి తవ్వకాలూ చేయకూడదు. ఏకారణం వల్ల అయినా పైప్ లైన్ పైకి కనబడితే వెంటనే ఆయా సంస్ధలకు తెలియచేయాలి.
మొదట్లో రైతులు ఈ ఒప్పందాన్ని గౌరవించేవారు. రానురానూ చేపల చెరువులకోసమో, వ్యవసాయ అవసరాలకోసమో, మట్టికోసమో కూడా పైప్ లైన్ మార్గాల్ని తవ్వేస్తున్నారు. పైపులు నేలమీదికి వచ్చేసి ఎండకు ఎండీ, వానకు తడిసీ బలహీనమైపోతున్నాయి. విషయం తెలిసి కూడా ప్రజాప్రతినిధులు తమతమ ప్రాంతాలలో ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ఆలోచనకూడా చేయడం లేదు. గ్యాస్ లీకయిన ప్రతీసారీ పరిహారాలు కావాలని ప్రజల్ని ఎగదోస్తున్నారు కూడా. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక, ఒఎన్ జిసి తల పట్టుకుంటోంది.
ఇలావుండగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా చేరి వున్న కెజి బేసిన్ లో చమురు ఇంధనవాయువుల అన్వేషణ, ఉత్పత్తి, పంపిణిలకోసం ఒఎన్ జి సి వచ్చే 5 ఏళ్ళలో 750 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతోంది. మూడు జిల్లాల్లోనూ 260 గ్యాస్ బావులను అనుసంధానం చేస్తూ 700 కిలోమీటర్ల పైప్ లైన్లు వున్నాయని లీకేజి సమాచారం అందుకోడానికి ఎల్లవేళలా పనిచేసే కంట్రోలు రూము, టోల్ ఫ్రీ పోన్ లైను, సుశిక్షితులైన ఫైర్ ఫైటర్ల టీములు వున్నాయని ఒఎన్ జిసి – కెజి ఎస్సెట్ డైరక్టర్ దేభశిస్ సన్యాల్ చెప్పారు.
ఒఎన్ జిసి ఉత్పత్తి చేసే గ్యాస్ ను గెయిల్ (గ్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) పారిశ్రామిక వినియోగ సంస్ధలకు పంపిణి చేస్తుంది. ఒఎన్ జిసి కి వున్నంత వర్క్ ఫోర్సు డిస్ట్రిబ్యూటర్ అయిన గెయిల్ కు లేదు. రెండేళ్ళ క్రితం గెయిల్ పైప్ లైన్ లీకయి అంటుకుంది. కోనసీమలోని చిన్న గ్రామమైన ”నగరం” వద్ద ఊరిమధ్యలో వున్న ఆపైప్ కి మంటలు అంటుకుని 14 మంది చనిపోయారు.