ఏపీ రాజధాని అమరావతిలో ఐదేళ్ల క్రితం వరకు శరవేగంగా పనులు కొనసాగాయి. సీఎం చంద్రబాబు ఉన్న సమయంలో రాజధాని ప్రాంతంలో ఆఫీసులు, క్వార్టర్స్ నిర్మించారు. వివిధ దశల్లో ఉన్న భవనాలను ప్రభుత్వం మారగానే, పూర్తిగా పక్కన పెట్టేశారు. జగన్ సర్కార్ అమరావతిని పట్టించుకోకపోవటంతో భవనాల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి.
అయితే, కూటమి సర్కార్ వచ్చాక అమరావతే రాజధాని ప్రకటించటం, రాజధాని నిర్మాణంలో వేగం పెంచారు. అయితే, ఏపీ ప్రస్తుతం ఉన్న దశలో తీవ్రమైన ఆర్థికలోటు వేధిస్తోంది. ఉన్న భవనాలు పనికొస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
దీంతో శుక్రవారం అమరావతికి ఐఐటీ నిపుణులు వస్తున్నారు. మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు పనికొస్తాయా? పనికొస్తే ఏయే భవనాలు పనికొస్తాయి? అన్న అంశాలను పరిశీలించబోతున్నారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్ నుండి ఇంజనీర్ల బృందాలు అమరావతికి వస్తున్నారు. సచివాలయం, వివిధ శాఖల అధిపతుల టవర్లు, హైకోర్టు నిర్మాణాలు ఫౌండేషన్ దశలోనే ఆగిపోయాయి. వీటిని ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం పరిశీలిస్తుంది.
కొంతమేర నిర్మాణాలు జరిగి… ఆగిపోయిన మంత్రులు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్వార్టర్లు పనికొస్తాయా? వస్తే ఎంతవరకు పనికొస్తాయన్న అంశాలను ఐఐటి హైదరాబాద్ నిపుణులు పరిశీలిస్తారు.
వీరిచ్చే నివేదికల ఆధారంగా అమరావతిలో నిర్మాణాలపై ప్రభుత్వం, సీఆర్డీయే తదుపరి చర్యలు తీసుకోనుంది.