సంగీత దర్శకులకు – గాయనీ గాయకులకు మధ్య ఓ గీత ఏర్పడిపోయింది. ఐపీఆర్ ఎస్ దయ వల్ల. ఓ పాటకు సంబంధించి పేటెంట్ హక్కుల్ని అందించే సంస్థ ఇది. ఓ పాట పుడితే…. దాని ద్వారా వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాన్ని సంగీత దర్శకులకు, పాట రాసిన వారికీ, నిర్మాతకు లేదంటే మ్యూజిక్ కంపెనీకి దక్కేలా ఈ ఐపీఆర్ ఎస్ సంస్థ చూస్తుంటుంది. అంటే ఓ పాట వచ్చిందంటే… ఆ పాట పాడిన గాయకుడికి, పేటెంట్తో సంబంధం లేదన్నమాట. తన పాటని ఆ గాయకుడే మళ్లీ పాడాలన్నా.. ఐపీఆర్ ఎస్కి ఎంతో కొంత రుసుము చెల్లించాల్సిందే. లేదంటే సదరు సంగీత దర్శకుడి అనుమతి తీసుకుని పాడాల్సిందే. ఇదే విషయమై… ఇళయరాజాకీ బాలూకీ మధ్య వివాదం నడుస్తోంది. బాలు వివిధ దేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అక్కడ.. రకరకాల పాటలు పాడి అలరిస్తుంటారు. దాని ద్వారా ఆదాయం కూడా వస్తుంది. ఆ ఆదాయంలో తనకీ వాటా ఉందన్నది ఇళయరాజా వాదన. ఐపీఆర్ ఎస్చట్టం చూసుకుంటే.. అది నిజమే. ఇళయరాజా అనుమతి లేకుండా బాలు ఆ పాటలు పాడకూడదు. ఈ విషయమై ఈ ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.
ఇళయరాజా నోటీసులతో.. బాలు ఆయన పాటల్ని పాడకుండా వదిలేశారు. కానీ… బాలు ఎక్కడకు వెళ్లినా ఇళయరాజా పాటలు పాడమంటూ… అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. బాలు హిట్ గీతాల్లో సగం ఇళయరాజా నుంచి వచ్చినవే. కాబట్టి కోర్టు నోటీసుల్ని కూడా పక్కన పెట్టి బాలు పాటలు పాడేస్తున్నాడు. ఇదేమని అడిగితే.. `కోర్టులో చూసుకుందాం` అంటున్నారు. `నా పాటల్ని నేను పాడుకునే హక్కు లేదా` అనేది బాలు మాట. కానీ… చట్ట ప్రకారం లేదు. ఓ ట్యూన్ సృష్టించేది స్వరకర్త. అందులో పదాలు పేర్చేది రచయిత. స్వరకర్త ఆదేశాల ప్రకారం.. గాయకుడు పాడతాడు కాబట్టి.. గాయకుడికి రాయల్టీ లభించడం లేదు. ఈ విషయమై గాయకులంతా ఎంత పోరాడినా.. వాళ్ల హక్కుల్ని కాపాడుకోలేకపోయారు. అలాంటప్పుడు `నా పాట నా ఇష్టం` అనే హక్కు బాలుకి ఎక్కడ వచ్చింది..? పరిస్థితి చూస్తుంటే… ఇళయరాజా – బాలుల మధ్య వైరం, దూరం ఇంకా కొనసాగుతూనే ఉన్నట్టుంది. ఇదెక్కడికి వెళ్లి ఆగుతుందో మరి.