ఇళయరాజా.. స్వరజ్ఞాని. దశాబ్దాలుగా సంగీత ప్రియుల సేద తీరుస్తున్న సప్త స్వరాల సముద్రం. దక్షిణాదినే కాదు, తన స్వరాలతో ఉత్తరాదినీ మంత్ర ముగ్థుల్ని చేసిన అద్భుతమైన కళాకారుడు. ఏళ్ల తరబడి.. దాచుకొని మరీ వినగలిగే ఎన్నో గొప్ప పాటల్ని ఆస్తులుగా అందించారాయన. ఇప్పుడు ఆయన కథ వెండి తెరపైకి వస్తోంది. ఇళయరాజా బయోపిక్‌ను అదే పేరుతో తెరపైకి తీసుకొస్తున్నారు. ఇళయరాజా పాత్రలో ధనుష్ నటించనున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పుడు పట్టాలెక్కింది. అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఓ హార్మోనియం పెట్టెతో, మద్రాసు మహానగరంలో అడుగు పెట్టిన ఇళయరాజా చిత్రాన్ని.. పోస్టర్ గా తీసుకొచ్చారు.
ఇళయరాజా కథంటే.. కేవలం అతని చరిత్ర మాత్రమే కాదు. ఆయన పనిచేసిన దర్శకులు, అవకాశం ఇచ్చిన గాయనీ గాయకులు, ఆయనతో పాటుగా ఎదిగిన మరికొంతమంది కళాకారుల కథ కూడా. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మణిరత్నం, వంశీ పాత్రలకూ ఈ కథలో కీలకమైన పాత్ర ఉంది. మరి ఆయా పాత్రల్లో ఎవరు కనిపిస్తారో చూడాలి. ఇళయరాజాని అభిమానించని ప్రేక్షకుడు ఉండడు. ఆ రకంగా చూస్తే… అందరి దృష్టినీ ఆకర్షించగలిగే శక్తి.. ఈ కథకు ఉన్నట్టే.