సంగీత దర్శకుడు ఇళయరాజాకీ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో యాజమాన్యానికీ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టూడియోలోని ఓ గదిలో ఇళయరాజా దాదాపు 40 ఏళ్ల నుంచీ తన ఆఫీసుగా చేసుకుని, అక్కడి నుంచే తన కార్యకపాలాల్ని నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల ప్రసాద్ యాజమాన్యం ఇళయరాజాతో ఆ గది ఖాళీ చేయించింది. దానికి ఆగ్రహించిన ఇళయరాజా.. ఆ గదిపై తనకు హక్కులున్నాయంటూ హైకోర్టుని ఆశ్రయించారు. `ధ్యానం చేయడానికి గదిలోకి వెళ్తే.. నన్ను అక్కడ ఉండనివ్వడం లేదు. నలభై ఏళ్లుగా ఉన్న గది నుంచి బలవంతంగా గెంటేశారు. ఆఫీసులోని నా సంగీత పరికరాల్ని ధ్వంసం చేశార`ంటూ.. హైకోర్టు కు విన్నవించుకున్నారు. హైకోర్టు కూడా.. ఇళయరాజా పక్షాన్నే మాట్లాడింది. `ఆయన్ని ఒక రోజు ధ్యానం చేసుకోవడానికి ఎందుకు అనుమతి ఇవ్వరు` అంటూ.. హైకోర్టు.. ప్రసాద్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. దీనిపై సోమవారం ప్రసాద్ స్టూడియో అధినేతలు కోర్టులో తమ వాదనలు వినిపించబోతున్నారు.
ఇళయరాజా గదిని అడుగుతోంది.. ధ్యానం చేయడానికి కాదు. అదీ ఒకరోజు కాదు. శాశ్వతంగా. ఆ గదిని మర్యాదపూర్వకంగా ఇళయరాజాకి అప్పగిస్తే, దాన్ని తన శాశ్వత ఆస్తిగా ఇళయరాజా ఎందుకు భావిస్తున్నారన్నది పెద్ద ప్రశ్న. ఇళయరాజాకు చెన్నైలో చాలా ఆఫీసులున్నాయి. అందులోనూ ఇళయరాజా మ్యూజిక్ సిట్టింగులు నిర్వహిస్తుంటారు. కాకపోతే… ప్రసాద్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ చేయడం ఇళయరాజాకు సెంటిమెంట్. ఆ గదికి ఇన్నేళ్లుగా ఆయన అద్దె కూడా చెల్లించడం లేదు. ఖాళీ చేయమన్నప్పుడు కూడా `ఈ గదికి నేను అద్దె కడతా` అని సైతం ఇళయరాజా అడగలేదన్నది… ప్రసాద్ అధినేతల వాదన. ఈ ఒక్క గది కోసం ఇళయరాజా పట్టుపట్టడం, కోర్టుకు ఎక్కడం ఏమిటన్నది ఆయన అభిమానులకు సైతం అర్థం కావడం లేదు. ఈ కేసు విషయంలో సోమవారం చెన్నై హై కోర్టు కీలకమైన తీర్పు వెలువరించే అవకాశం వుంది.