మాస్ట్రో ఇళయరాజా లైవ్ షోకి హైదరాబాద్ మరోసారి వేదికైయింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇళయరాజా లైవ్ షో సంగీత ప్రియులని, అభిమానులని అలరించింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో లైవ్ షో ప్రారంభమైయింది. ఇళయరాజా పాడిన జననీ జననీ పాటతో మొదలైన మ్యూజికల్ ట్రీట్ ఆద్యంతం ఆకట్టుకుంది. కార్తిక్ పాడిన ఓం శివోహం పాట ప్రేక్షకుల్లో గొప్ప ఉత్సాహాన్ని తెచ్చింది. ఎన్నో రాత్రులోస్తాయిగానీ, మాటే మంత్రము, కలయా నిజమా పాటలని ఇళయరాజా స్వయంగా అలపించి అలరించారు. ఈ లైవ్ షో లో దాదాపు 35 పాటలు అలపించారు. ఎక్కడా రీటెకులు తీసుకోకుండా అపశ్రుతులు దొర్లకుండా లైవ్ షో ని కండక్ట్ చేయడంలో ఇళయరాజా మరోసారి తన మార్క్ చూపించారు. మనో, ఎస్పీ చరణ్ .. బాలు లేని లోటుని తీర్చడానికి తమ శక్తి మేరకు ప్రయత్నించారు. కార్తిక్, శరత్ లు కూడా ఆకట్టుకున్నారు. చివర్లో సింగారాల పైరుల్లోన పాట స్టేడియంని సందడిగా చేసింది. ఫిమేల్ సింగర్స్ విభావరి, శ్వేత, సునీత, శీరిష, అనిత మాధుర్యాన్ని అందించారు.
* వన్ అండ్ ఓన్లీ ఇళయరాజా :
ఇళయరాజాని మ్యూజికల్ గాడ్ అంటారు. ఆయన స్వరపరిచిన పాటల్లో ఎదో మహత్తు వుంటుంది. ఏళ్ళు గడుస్తున్న అందులో వున్న ఫ్రెష్ నెస్ ఇంచు కూడా తగ్గదు. ఎన్ని సార్లు విన్నా అదే మ్యాజిక్, ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. ఆయన కంపోజిషన్ కూడా ప్రత్యేకం. ఒక పాట తయారీ వెనుక ఎలాంటి శ్రమ వుంటుంది ? ఎంత సృజన అవసరమో .. ఓ ప్రియ ప్రియ.. పాటలో వచ్చే ఒక ఇంటర్ల్యుడ్ తో ప్రేక్షకులకు వివరించారు రాజా. ఎన్ని లేయర్లలో వర్క్ జరుగుతుందో చెప్పి.. ఇలా సంగీతాన్ని ప్రేక్షకులకు చెప్పే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా వున్నారా ? అని ప్రశ్నించి.. ‘ఎవరు లేరు..నేను మాత్రమే ఇలా చెప్తాను’ అని ఇచ్చిన సమాధానంతో మైదానంలో చప్పట్లు మారుమ్రోగాయి. ఎనభై ఏళ్ల వయసులో మూడున్నర గంటల పాటలు ఒక్క సెకన్ కూడా కూర్చుకుండా ఆయన లైవ్ కండక్ట్ చేయడం అందరినీ సర్ప్రైజ్ చేసింది.
* బాలు లేని లోటు :
ఇళయరాజా లైవ్ షో అంటే బాలు వుంటే ఆ సందడే వేరు. పాటలతో పాటు మంచి సరదా కబుర్లు వుంటాయి. ఇళయరాజాని.. ఏరా అని పిలిచే చనువు బాలుకుంది. రాజా మ్యూజిక్ లోని గ్రేట్ నెస్ బాలు చెబుతుంటే ఆ మ్యాజిక్ వేరుగా వుంటుంది. అది ఈ షో లో మిస్ అయ్యింది. పాటలు వెనుక వున్న కబుర్లు చెప్పే మనిషే కనిపించలేదు. దీంతో చాలా వరకూ ఇళయరాజనే తన పాట గురించి వివరించి అందులోని స్పెషాలిటీ చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే షో దాదాపు బాలు పాడిన పాటలనే పాడారు. ఎస్పీ చరణ్, మనో, కార్తిక్ చక్కగా అలపించారు. కానీ బాలు వాయిస్ మిస్ అయిన ఫీలింగ్ మాత్రం చాలా చోట్ల కలిగింది. జగదానంద కారక, ఆమని పాడవే కోయిలా, హలో గురూ ప్రేమ కోసమే, . సువ్వీ సువ్వి సువ్వాలమ్మా , ప్రేమ ఎంత మధురం , వేదం అణువణువున, యమహా నీ యమ యమ అందం, మాటరాని మౌనమిది, అబ్బనీ తీయని దెబ్బ, జగడ జగడ జగడం .. ఇలా పాటలన్నీ వినిపిస్తున్నడు కళ్ళ ముందు బాలునే కదిలారు.
* దేవిశ్రీ ప్రసాద్ ఫ్యాన్ మూమెంట్ :
దేవిశ్రీ ప్రసాద్ ఇళయరాజకి భక్తుడు. రాజా లైవ్ షో ఎక్కడున్న రెక్కలు కట్టుకొని వాలిపోవడం దేవిశ్రీకి అలవాటు. గచ్చిబౌలి స్టేడియంలో కూడా దేవిశ్రీ సందడి కనిపించిది. ప్రతి పాటకు పరవశించిపోయారు. జగడ జగడ జగడం పాటకైతే కూర్చున్న చోటే డ్యాన్స్ చేశారు. స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడే అవకాశం దేవిశ్రీకి దక్కింది. ‘’మీ పాటకి మా మనసులు, ప్రాణాలు, జీవితాలే ఊగుతున్నాయి. రాజా గారికి దేశం భాషతో పని లేదు. ఆయన మన మనసులో నిండిపోయారు’’ అని తన ఆనందం పంచుకున్నారు. టాలీవుడ్ నుంచి నాని, హరీష్ శంకర్, బుచ్చిబాబు, మంచు లక్ష్మీ, ఇషా రెబ్బా, వర్ష బొల్లమ్మ..చాలా మంది ప్రముఖులు హజరయ్యారు.
* కళాతపస్వి కి అంజలి :
లైవ్ షో లో కళాతపస్వి కె విశ్వనాథ్ కి అంజలి ఘటించారు ఇళయరాజా. సాగరసంగమం, స్వాతి ముత్యంలోని వేదం అణువణువున తకిట తధిమి తందాన, మౌనమేలనోయి, లాలి లాలి పాటలతో కె విశ్వనాథ్ కి నివాళి అర్పించారు.
* హోరెత్తిన యువత :
పాటని అభిమానించే వాళ్ళంతా ఇళయరాజా అభిమానులే. అందుకే ఆయన పాటకు అభిమానులు పుట్టుకొస్తునే వుంటారు. తాజా లైవ్ షోలో ఎక్కువగా యువత కనిపించింది. స్టేడియంలోని అన్ని సెక్షన్ లు నిండిపోయాయి. షో పూర్తయిన వరకూ ఫుల్ క్రౌడ్ వుంది. తాము అభిమానించే పాటల స్వరకర్తని ప్రత్యేక్షంగా చూసి … ఇలాంటి పాటల రాత్రులు మళ్ళీ మళ్ళీ రావాలని మేస్ట్రో మ్యూజికల్ నైట్ ని ఎంజాయ్ చేశారు వీక్షకులు.