ఎందుకో… ఇళయరాజా అప్పుడప్పుడూ వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. అందులో ఆర్థిక పరమైనవే ఎక్కువ. అప్పట్లో తన ఆప్తుడు, సన్నిహితుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంపై `రాయల్టీ` విషయంలో గొడవ పడ్డారు. ఆ వివాదం మెల్లమెల్లగా సద్దుమణిగింది. ఇప్పుడు ఎల్వీ ప్రసాద్ స్టూడియో విషయంలోనూ ఇలానే కోర్టు, పోలీసు స్టేషను చుట్టూ తిరుగుతున్నాయి.
చెన్నైలోని ఎల్వీ ప్రసాద్ స్టూడియోలో.. ఇళయరాజాకు రికార్డింగ్ థియేటర్ ఉంది. అయితే అది ఆయనది కాదు. స్టూడియోదే. అప్పట్లో ఎల్వీ ప్రసాద్.. ఇళయరాజాపై గౌరవంతో.. `ఈ స్టూడియో మీరు వాడుకోండి` అన్నారు. నలభై ఏళ్లుగా ఇళయరాజా అందులోనే కంపోజింగ్ చేస్తున్నారు. ఆ స్టూడియో ఇళయరాజా ఆఫీసు, అడ్డాల మారింది. ఇప్పుడు ఎన్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ తో ఇళయరాజా గొడవ మొదలైంది. ఈ స్టూడియోని ఖాళీ చేయాలని.. ఇళయరాజాకు ఆయన నోటీసులు జారీ చేశారు. ఇక్కడే ఇళయరాజా గొడవకు దిగారు. `ఈ రికార్డింగ్ థియేటర్ నాది… ఖాళీ చేసే ప్రసక్తి లేదు` అంటూ.. కోర్టుకెళ్లారు.
నిజానికి ఈ స్టూడియోపై ఇళయరాజాకు ఎలాంటి అధికారం లేదు. రికార్డింగ్ థియేటర్ సైతం.. ఎన్వీ ప్రసాద్ వారసుల పేరుపైనే ఉంది. దాన్ని ఇళయరాజా కేవలం వాడుకుంటున్నారంతే. నలభై ఏళ్లుగా ఆయన ఈ స్టూడియోకి ఎలాంటి రుసుమూ చెల్లించడం లేదని తెలుస్తోంది. కేవలం ఇళయరాజాపై గౌరవంతో.. అభిమానంతో.. రికార్డింగ్ స్టూడియో ఇస్తే.. ఇప్పుడు దాన్ని ఖాళీ చేసేది లేదంటూ ఇళయరాజా గొడవ పడుతున్నారు. కోర్టులో కేసు వేశారు. ఎటు చూసినా ఈ కేసు నిలబడదు. ఇళయరాజా ఖాళీ చేయాల్సిందే. కానీ… ఇళయరాజా మాత్రం మొండి పట్టుదలకు పోతున్నారు. తనపై ఎల్వీ ప్రసాద్ వారసులు దాడి చేశారని, బలవంతంగా స్టూడియోని ఖాళీ చేయిస్తున్నారని, స్టూడియోలోని సామాగ్రిని సైతం ధ్వంసం చేస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్టూడియోపై ఇళయరాజాకు ఎలాంటి హక్కూ లేదని, ఆయన గౌరవంగా ఖాళీ చేస్తే హుందాగా ఉండేదని, ఇప్పుడు అనవసరంగా ఈ కేసు కోర్టు వరకూ వెళ్లిందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ గొడవ ఎప్పుడు సద్దుమణుగుతుందో?