ఇలియానా… దాదాపు ఆరేళ్ల తరవాత తెలుగు తెరపై కనిపించింది. `అమర్ అక్బర్ ఆంటోనీ`తో. తనకు అచ్చొచ్చిన హీరో.. రవితేజతో జోడీ కట్టడం, ఈ సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని చిత్రబృందం పదే పదే చెబుతుండడంతో…. నిజంగానే ఇలియానా కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరుగుతుందనుకున్నారంతా. దానికి తోడు… ఇలియానా కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగు చిత్రసీమకు తాను దూరంగా వెళ్లలేదని, ఇక్కడే మరిన్ని సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చింది. `అమర్ అక్బర్ ఆంటోనీ` హిట్టయితే ఇలియానాకీ అవకాశాలు వచ్చేవే. ఈ సినిమా హిట్టయితే తమ టీమ్ లోకి ఇల్లూ బేబీని తీసుకోవాలని ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కర్చీఫ్లతో రెడీ అయిపోయారు కూడా.
కానీ 2018 డిజాస్టర్లలో అమర్ అక్బర్ కూడా చేరిపోయింది. దానికి తోడు… ఇలియానా బొద్దుగా మారిపోయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సన్నగా.. నాజూగ్గా ఉండే ఇలియానాని ఇలా బొద్దుగా చూడాల్సిరావడం.. ఆమెని అభిమానించేవాళ్లకూ ఏదోలా ఉంది. ఇలియానా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఏమంత గొప్పగా లేదని చాలామంది పెదవి విరిచారు. ఇక మీదట ఇలియానాకు తెలుగులో అవకాశాలు రావడం కలగానే కనిపిస్తోంది. కొత్త కథానాయికల జోరు ముందు… ఇలియానా కనిపించడం దాదాపు అసాధ్యమే. స్టార్ కథానాయికలు ఒకొక్కరుగా మరుగున పడిపోతున్న ఈ దశలో, అమర్ అక్బర్ ఆంటోనీలాంటి ఫ్లాపు తరవాత కూడా ఇలియానా పుంజుకుంటే అది అద్భుతమే అనుకోవాలి.