ఏ వంకా లేనమ్మ డొంక పట్టుకొని వేలాడిందట.. ఇలియానా మాటలు చూస్తే ఈ పాత సామెతే కొత్తగా గుర్తొస్తుంది. సన్నగా రివటలా ఉండే ఇలియానా.. దేవదాసుతో అందరినీ పోకిరీలను చేసింది. ఆ నడుము దగ్గరే సగం మంది పడిపోయారు. ఆమె స్మైల్‌కి అంతా ఖలాసే. ఆ జోరు కొన్నాళ్లు సాగింది. ఎప్పుడైతే బాలీవుడ్ పై మక్కువ పెంచుకొందో, అప్పటి నుంచీ ఇలియానా కెరీర్ సౌత్‌లో పూర్తిగా క్లోజ్ అయ్యింది. సమంత, తమన్నా, రకుల్, రాశీఖన్నాలాంటి కథానాయికలు జోరు చూపించడంతో ఇలియానాను దాదాపుగా అందరూ మర్చిపోయారు. అప్పట్లో ఒకట్రెండు ఆఫర్లు వెళ్లినా… ఇలియానా దాన్ని కాలితో తన్నుకోవడంతో అసలు ఆమె గురించి ఎవ్వరూ పట్టించుకోవడమే మానేశారు. కానీ ఇల్లూ బేబీ మాత్రం.. నాకు అవకాశాలు రాక కాదు, కానీ నాకే నచ్చడం లేదంటూ కాకమ్మ కథలు చెబుతోంది.
ప్రతీరోజూ ఎవరో ఒకరు వచ్చి తనకు కథలు వినిపిస్తున్నార్ట. కానీ.. ఏ కథా నచ్చకపోవడంతో సినిమాలు ఒప్పుకోవడం లేదట. నచ్చని సినిమాలు ఒప్పుకోవడం కంటే, ఖాళీగా కూర్చోవడం ఉత్తమమని డిసైడ్ అయ్యిందట. ఇదీ ఇప్పుడు ఇలియానా చెప్పుకొస్తున్న లేటెస్ట్ కహానీ. ఇలియానాకు సినిమాలంటే ఇంట్రస్ట్ బాగా తగ్గిపోయిందని, అందుకే ఆ ధ్యాసలోంచి ఎప్పుడో బయటకు వచ్చేసిందని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అయితే ఆమధ్య ఖాళీగా ఉండలేక తనకు తెలిసిన దర్శక నిర్మాతల్ని సంప్రదించి అవకాశాల కోసం తెగ తాపత్రయపడిందని, అయితే ఇలియానాని ఎవ్వరూ కనికరించలేదని టాక్. అలాంటి ఇలియానా ఇప్పుడు కథలు నచ్చలేదు.. అంటే ఎవరు నమ్ముతారు??