మిషన్ భగీరథ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. మెటీరియల్ కొ నుగోలు వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్టు, పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారనే ఫిర్యాదులు రావడంతో మిషన్ భగీరథ పైప్లై న్ పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు ఈ పథకంలో రూ.7000 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ విజిలెన్స్ విభాగం అంతర్గత నివేదిక సమర్పించింది.
ప్రతి మండలంలోనూ ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడ చేసిన పనులు, ఖర్చు చేసిన నిధులు తదితరాలను పరిశీలించాలని నిర్దేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంటింటికీ మంచినీటి అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టింది. ఆయా గ్రామాల వరకూ పైపు లైన్లను వేసినా.. గ్రామాల్లో మాత్రం పాత ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపు లైన్లకే లింక్ చేసినట్లు కాంగ్రెస్ సర్కారుకు నివేదికలు అందాయి. అవన్నీ కూడా అంతకు ముందు కాంగ్రెస్ హయాంలో వేసినవేనని కూడా వాటిలో స్పష్టం చేశారు. ఆయా ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్లను వేయకుండానే వేసినట్లు బిల్లులు కూడా తీసేసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. తద్వారా కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రతిష్టాత్మక పనుల్లో మిషన్ భగీరథ కూడా ఒకటి. భారీ ఖర్చుతో చేపట్టారు. అయితే ఇందులో లెక్కలేనంత అవినీతి ఉందని.. పైపుల పేరుతో పెద్ద ఎత్తున కొల్లగొట్టారన్న విమర్శలు ఉన్నాయి. వాటి లెక్క తేల్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇందులో విచారణ ప్రారంభమైతే మరికొంత మంది బీఆర్ఎస్ నేతలకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయమనుకోవచ్చు.