థాయ్‌ల్యాండ్‌లో చీకోటి ప్రవీణ్ ముఠా గ్యాంబ్లింగ్ చేస్తూ దొరకగానే అందరికీ వచ్చిన డౌట్… అక్కడ గ్యాంబ్లింగ్ లీగలే కదా అని. అక్కడ లీగలే అని చెప్పి ఇక్కడ నుంచి కస్టమర్లను తీసుకెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. కానీ అక్కడ గ్యాంబ్లింగ్ లీగల్ కాదు. పట్టుకుంటే బయటకు రావడం కష్టమని కూడా తెలుసు. అదే ఇల్లీగల్ కేసినోను ఏపీలో నిర్వహించుకుంటే… పూర్తి రక్షణ కల్పిస్తారు. మరి ఎందుకు చీకోటి ప్రవీణ్ థాయ్ ల్యాండ్ వెళ్లారనేది సస్పెన్స్ గా మారింది.
చీకోటి ప్రవీణ్ హైదరాబాద్ స్టార్ హోటళ్లలో కూడా ఇలాంటి గ్యాంబ్లింగ్‌లు నిర్వహించారు. కొన్ని సార్లు పట్టుబడ్డారు. కానీ ఆయన రోజుల్లోనే బయటకు వచ్చారు. ఏపీలో ఓ సంక్రాంతి పండుగకు ఆయన నిర్వహించిన కేసినో సంచలనం అయింది. గత సంక్రాంతికీ నిర్వహించారు. కానీ అక్కడ పెద్దలు సంపూర్ణ అండదండలు ఉండటంతో బయటకు రాలేదు. ఇల్లీగల్‌గా చేయాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత స్వేచ్చ ఉంటే…ఎందుకు థాయిలాండ్ వెళ్లారు.
థాయ్ మసాజ్‌ల కోసమే వెళ్లారా… జల్సాల కోసమే వెళ్లారా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే అలాంటివి ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టం కాదు. అంతగా కావాలనుకుంటే లీగల్ అయిన మరో దేశానికి వెళ్లవచ్చు. కానీ ఇల్లీగర్ అయిన థాయ్ ల్యాండ్‌కే చీకోటి ప్రవీణ్ అంత మందిన ఎందుకు తీసుకెళ్లాడు ? అలాంటి రిస్క్ ఎందుకు తీసుకున్నాడన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. గ్యాంబ్లింగ్ కన్నా మించిన స్కెచ్ చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.వంద కోట్లు చిన్న మొత్తం కాదు. గతంలో చీకోటి ప్రవీణ్ ఇలాంటివి నిర్వహించాడు. కోట్లకు పడగలెత్తాడు. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా విచారణ జరిపింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. బహుశా ఎలాంటి ఆధారాలు దొరకలేదమో . చీకోటి ప్రవీణ్‌కు రాజకీయ నేతలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి దగ్గర్నుంచి అనేక మంది ఆయన ఫామ్ హౌస్‌కు వెళ్లారు. రహస్యంగా ఎంత మంది ఆయనకు మిత్రులో చెప్పాల్సిన పని లేదు. గుడివాడలో గ్యాంబ్లింగ్ నిర్వహణలో కొడాలి నాని, వంశీల ప్రమేయం ఉందని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా.. గ్యాంబ్లింగ్ ను మించిన హవాలా వ్యాపారం కోసమే థాయిల్యాండ్ను ఎంచుకున్నారన్న అనుమానాలువస్తున్నాయి. ఆ గుట్టు ధాయ్ పోలీసులు బయటకు తెస్తారో లేదో చూడాల్సి ఉంది.