తెలంగాణ దూసుకుపోతోందనీ, అన్ని రంగాల్లో అద్భుతాలు సాధిస్తోందనీ, దేశమంతా ఇక్కడి సంక్షేమ పథకాలూ నీటి పారుదల ప్రాజెక్టులవైపే చూస్తోందంటూ అధికార పార్టీ ఎప్పటికప్పుడు భారీగానే ప్రచారం చేసుకుంటూ ఉంది. కానీ, వీటన్నింటికంటే చాలా ముఖ్యమైన అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే… నిరక్షరాస్యత. సంపూర్ణ అక్షరాస్యత లేకపోతే… మిగతావి ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నా అది నిజమైన అభివృద్ధి కాదు. రకరకాల అభివృద్ధి సూచికల్లో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని మురిసిపోతున్నా, అక్షరాస్యతలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కింది నుంచీ 4వ స్థానంలో ఉంది. అందుకే, ఇప్పుడు హుటాహుటిన దీనిపై ప్రభుత్వం స్పందించడం మొదలుపెట్టింది.
ఆరు నెలల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధించి చూపిస్తామంటున్నారు సీఎస్ సోమేష్ కుమార్. నిరక్షరాస్యత రాష్ట్రానికి ఒక మచ్చలా తయారైందన్నారు. శాసన మండలి ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… నిరక్షరాస్యతను అధిగమించే కార్యక్రమాలను శరవేగంగా చేపడతామన్నారు. అందుకే ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులను పంచాయతీ కార్యదర్శులు గుర్తిస్తారన్నారు. వారికి చదువు చెప్పే బాధ్యతని టీచర్లు, వలంటీర్లు, కుటుంబంలో చదువుకున్నవారు ఎవరైనా ఉంటే వారికి అప్పగిస్తామన్నారు. ఆరు నెలల్లో రాష్ట్రంలో నిరక్షరాస్యులు అనేవారు లేకుండా చేస్తామన్నారు.
ప్రభుత్వం మంచి లక్ష్యాన్నే నిర్దేశించుకుంది. కానీ, దీని అమలు విషయంలో ఇప్పుడు చూపిస్తున్న ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. గతంలో.. అంటే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఇలానే జిల్లాలవారీగా వయోజన విద్య కోసం వలంటీర్లను పెట్టి, రాత్రిపూట బడులు నడిపే ప్రయత్నాలు జరిగాయి. అక్షర జ్యోతి, అక్షర విజయం, అక్షర దీపం… ఇలా చాలా పేర్లో చాలా కార్యక్రమాలను గత ప్రభుత్వాలు ప్రారంభించాయి. వయోజనుల కోసం ప్రత్యేకమైన పాఠ్య పుస్తకాలను కూడా తయారు చేశారు. కానీ, అవన్నీ ఆరంభ శూరత్వాలుగానే మిగిలిపోయాయి. ఆశించిన ఫలితాలను సాధించిన దాఖలాలు లేవు. కనీసం ఇప్పుడైనా… తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుని అమలు చేస్తుందో చూడాలి. నిజానికి, తెలంగాణ ఏర్పడ్డ వెంటనే నీళ్లూ నిధులూ నియామకాలతోపాటు అంతే ప్రాధాన్యతాంశంగా నిరక్షరాస్యత నిర్మూలనను కూడా కేసీఆర్ సర్కారు తీసుకోవాల్సింది.