రామ్‌దేవ్ బాబా అల్లోపతి వైద్యం పనికి రాదంటూ వ్యాఖ్యలు చేసి.. రూ. వెయ్యి కోట్ల దావాను ఎదుర్కొంటున్నారు. ఉత్తరాఖండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విభాగం ఆయనపై దావా వేసింది. పతంజలి పేరుతో ఆయుర్వేదిక ఉత్పత్తుల పేరుతో… రూ. వేల కోట్ల వ్యాపారం చేస్తున్న రామ్‌దేవ్ బాబా.. ఇటీవల తన వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్నారు. కరోనిల్ పేరుతో తెచ్చిన కరోనా వైద్య ప్యాకెట్లు కూడా కంపెనీకి లాభాలను తెచ్చి పెట్టలేదు. ఈ అసహనమో.. లేకపోతే.. తన మందులపై నమ్మకం పెంచడానికి అల్లోపతిపై దుష్ప్రచారం చేయాలని అనుకున్నారో కానీ.. రంగంలోకి దిగిపోయారు. కరోనా వైరస్ కట్టడిలో అల్లోపతి వైద్యం విఫలమైందని.. అదో పనికిమాలినదంటూ రాందేవ్ బాబా వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు.
అల్లోపతి వైద్య విధానం పని చేయకపోవడంతోనే లక్షలాది మంది చనిపోతున్నారని తేల్చేశారు. అల్లోపతి ఒక కుంటి శాస్త్రం.. మొదట హైడ్రాక్సీక్లోరోక్వీన్ విఫలమైంది.. ఇప్పుడు రెమిడేసివర్, ప్లాస్మా థెరపీ విఫలమయ్యాయి. ఫాబిప్లూ స్టెరాయిడ్లతో సహా ఇతర యాంటిబయాటిక్స్ కూడా పని చేయడం లేదని రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు. రాందేవ్ వ్యాఖ్యలపై భారత వైద్య సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లోపతి వైద్యం, వైద్యులను అవమానించేలా బాబా రాందేవ్ మాట్లాడారని ఐఎంఏ ఆరోపించింది. కరోనా కాలంలో ఎన్నో ఒడిదుడుకులకు గురవుతూ, వైద్యులు శ్రమిస్తుంటే రాందేవ్ బాబా ఈ రకంగా నిందలు వేయడం తగవని మండిపడ్డారు.
రాందేవ్ బాబాకు ఐఎంఏ లీగల్ నోటీసు కూడా పంపింది.. ఐఎంఐ నేతల ఒత్తిడితో రాందేవ్‌బాబా వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ స్పందించారు. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా వ్యాఖ్యలు సరికావన్నారు. రాందేవ్ బాబా తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ సూచించారు. లేఖ కూడా రాశారు. మొత్తంగా తేడాగా మారుతోందని గుర్తించిన రాందేవ్ బాబా.. తమ మాటలు వక్రీకరించారని చెప్పుకొచ్చారు. గతంలో కూడా రాందేవ్ బాబా ఆధునిక వైద్యులను హంతకులుగా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వెయ్యి కోట్ల దావాను ఎదుర్కొంటున్నారు.