ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ స్ట్రిక్ట్ ఐఏఎస్ అధికారిగా పని చేసుకుంటూ పోతున్నారు. ఓ రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా తనకు ఉన్న అధికారాలను పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సర్వీస్ రూల్స్ మొత్తం తెలిసిన వ్యక్తిగా… సహకరించని ఉద్యోగులు.. అధికారులు తప్పు చేశారని ప్రత్యేకంగా నిరూపించాల్సిన అవసరం లేకుండా.. వారి ద్వారానే సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ కోసం ఎవరూ హాజరు కాలేదు… అది సంపూర్ణంగా హైకోర్టు ఉత్తర్వుల ధిక్కరణే అని తేల్చేలా ఆయన ఐదు గంటల వరకూ ఆఫీసులోనే ఉండి.. అన్ని టెక్నికల్ ఇష్యూస్ సరిగ్గా ఉన్నాయని సాంకేతిక ఆధారాలు రెడీ చేసుకున్నారు.
ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తారని… హైకోర్టులో ప్రత్యేకమైన పిటిషన్ వేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ.. అలాంటిదేమీ లేకుండానే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 25వ తేదిన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేసి.. నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి. కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ తాము సహకరించేది లేదని ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సోమవారం ఉదయం జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ విచారణపై తదుపరి నిర్ణయం వచ్చేవరకు వేచిచూడాలని ప్రభుత్వం భావిస్తోంది
ఇప్పటికే హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం ఉల్లంఘించినట్లయింది. తీర్పులో 35వ పేజీలో కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినతీర్పును హైకోర్టు ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(K)(3) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులందరూ కమిషన్ ఆదేశాలకు లోబడి పనిచేయాలని కమిషన్ కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఉద్యోగులు రాలేదు. దీన్నే… ఎస్ఈసీ అస్త్రంగా తీసుకునే అకాశం కనిపిస్తోంది. ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వతా ఎస్ఈసీ నిమ్మగడ్డ విశ్వరూపం చూడొచ్చంటున్నారు.