జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను… అరెస్ట్ చేసి తీరాలన్న పోలీసుల అత్యాత్సాహం..కోర్టు మొట్టికాయలకు కారణం అయింది. పోలీస్ స్టేషన్ పై దాడి చేశారంటూ.. రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును పోలీసులు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరు పరిచారు. కస్టడీ విధించాలని కోరారు. అయితే.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు కస్టడీ విధించేందుకు రాజోలు మున్సిఫ్ మెజిస్ట్రేట్ నిరాకరించారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే విధానం ఇది కాదని మెజిస్ట్రేట్ వ్యాఖ్యానించారు. రాపాక పై నాన్ బెయిలబుల్ కేసు అంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులకు..కోర్టు స్పందనతో..షాక్ తగిలింది. దాంతో.. స్టేషన్‌కు తీసుకొచ్చి.. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. కోర్టు అక్షింతలతో.. తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు మరకపడింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను రాజకీయంగా టార్గెట్ చేసిన వైనాన్ని పోలీసులే..తమ చేతల ద్వారా ప్రజల్లోకి పంపారు. రోజంతా..కలకలం రేపిన…జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు… స్టేషన్ బెయిల్ ఇచ్చి…పోలీసులు గౌరవంగా సాగనంపి..పరువు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
తమ పార్టీ ఏకైక ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుసుకున్న పవన్ కల్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. ప్రజల తరపున పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాపాకపై కేసులు సరికాదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో జర్నలిస్ట్‌పై దాడి చేసిన.. వైసీపీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని … మలికిపురం ఘటనలో స్టేషన్ బెయిల్‌తో సరిపోయేదాన్ని అరెస్ట్ దాకా తీసుకొస్తారా? అని పవన్ ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు, నాయకులు సంయమనం పాటించాలని .. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే తానే రంగంలోకి దిగుతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. జనసేన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ వివాదం విషయంలో… మొదట్లో పెద్దగా హడావుడి చేయని పోలీసులు ఈ రోజు మాత్రం.. అరెస్ట్ పేరుతో హడావుడి చేయడం వెనుక రాజకీయ కోణం ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
జనసేన ఎమ్మెల్యే మొదట్లో… జగన్ కు అనుకూలంగా మాట్లాడినప్పటికీ.. ఇటీవలి కాలంలో.. పూర్తి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు నెలల్లోనే జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో.. ఆయనను.. వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో కేసుల పేరుతో ఒత్తిడి తెద్దామని చూసి.. భంగపడ్డారని.. జనసేన నేతలు చెబుతున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాపాక వరప్రసాద్ ల విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పు పట్టారు.