ఏపీలో నూతన మద్యం విధానంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. కొత్త మద్యం పాలసీని అమలు చేయాలని నిర్ణయించిన సీఎం చంద్రబాబు.. ఈమేరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయన ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఈ అంశంపై అధికారులతో మరోసారి చర్చించనున్నారు.
కొత్త మద్యం విధానంపై అధికారులు సిద్దం చేసిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో ప్రధానంగా చంద్రబాబు ఆరా తీయనున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి పాత మద్యం విధానం ముగియనుండటంతో అక్టోబర్ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీని అమలు చేయలని నిర్ణయించారు. ఇందుకోసం నూతన మద్యం విధానంతో పాటు లిక్కర్ బాటిల్ కు నకిలీ హోలోగ్రాం సీల్ విషయంపై కూడా చర్చించనున్నారు.
అక్టోబర్ నాటికి కొత్త మద్యం పాలసీ అమల్లోకి తీసుకురావాలనే అభిప్రాయంతోనే ప్రాథమికంగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పాత విధానంలో ఉన్న లోపాలను సరి చేసి.. కొత్తగా తీసుకురానున్న విధానంలో ఎలాంటి మార్పులు చేపట్టాలి అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వాలా..? వద్దా..? అనే అంశంపై కూడా చర్చ జరగనుంది.