33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలంటూ భారత్ జాగృతి తరపున ధర్నా చేయడానికి సిద్ధమైన కవిత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి చిక్కులు తెచ్చి పెడుతోంది. సొంత పార్టీలో మహిళలకు కనీస ప్రాధాన్యత ఇవ్వరు కానీ.. దేశవ్యాప్తంగా 33 శాతం రిజర్వేషన్లు కావాలని ధర్నా చేస్తారట అని ఇతర పార్టీల నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ క్షణమైనా ఆమెను సీబీఐ అరెస్ట్ చేయవచ్చుని.. కేంద్రంపై పోరాటం చేస్తున్నందుకే అరెస్టు చేస్తున్నారనే ఫీలింగ్ కల్పించడానికే ఆమె మహిళా రిజర్వేషన్లు ఎత్తుకున్నారని అంటున్నారు.
నిజానికి బీఆర్ఎస్ పార్టీలో మహిళలకూ ఎప్పుడూ ప్రాధాన్యం దక్కలేదు. 2014 ఎన్నికల్లో మహిళలకు ఇచ్చింది 6 సీట్లు. 2018లో మహిళలకు మరో రెండు తగ్గించి 4 సీట్లు ఇచ్చారు. శాసనమండలిలో 34 సీట్లకు మహిళలకు మూడు సీట్లు కేటాయించారు. 17 పార్లమెంట్ స్థానాలకు ఇద్దరికి.. చాన్సిచ్చారు. తెలంగాణ తొలి క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదు.. మహిళా సంక్షేమ శాఖ కూడా మగ మంత్రికే ఇచ్చారు. ఇప్పుడున్న క్యాబినెట్ లో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఈ లెక్కలన్నీ బయటకు తీసి.. ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల లిక్కర్ స్కామ్ ను పక్కదోవ పట్టించేందుకు మహిళా రిజర్వేషన్ అంశాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.