భ్రమలు తొలగిపోయాయి. వాస్తవాలు బోధపడ్డాయి. కాలం ఎంత మారినా మూలాలు మరువకూడదని నరేంద్ర మోడీ బృందానికి అర్థమైంది. వ్యవసాయ ప్రధానమైన దేశంలో వ్యవసాయమే ముఖ్యం. మేకిన్ ఇండియా అవసరమే గానీ పల్లెలే పట్టుగొమ్మలైన భారత్ లో రైతును రాజును చేసే ప్రయత్నాలు కీలకం. అరుణ్ జైట్లీ బడ్జెట్ ఈసారి ఈ దిశలోనే కనిపించింది.
ప్రధాని నరేంద్ర మోడీలో ఏడాదిలో ఎంతో మార్పు వచ్చింది. విదేశీ పర్యటనలు, భారీ ప్రకటనలు, మేకిన్ ఇండియాపై ఊకదంపుడు ఉపన్యాసాలతో ఆయన పాపులారిటీ బాగా తగ్గిపోయింది. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే కష్టమన్న వాస్తవాన్ని మోడీ గుర్తించినట్టు కనిపిస్తోంది. అందుకే, అరుణ్ జైట్లీ బడ్జెట్ ఎయిర్ బస్సుకు బదులు ఎర్ర బస్సు మార్గంలో ప్రయాణించింది. పల్లెలకు మంచి రోడ్లు వేయడానికి సంకల్పించింది. రహదారుల నిర్మాణానికి జైట్లీ 97 వేల కోట్ల భారీ పద్దునే ప్రకటించారు.
వ్యవసాయం, ఇరిగేషన్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రోడ్ల నిర్మాణం, పల్లెల్లో డిజిటల్ అక్షరాస్యతకు ప్రాధాన్యం… ఇవన్నీ మోడీ మైండ్ సెట్ లో వచ్చిన మార్పులకు సంకేతాలు. ఇది కోటీశ్వరుల ప్రభుత్వం అని విపక్షాలు ఇకమీదట తిప్పికొట్టే అవకాశం ఇవ్వకూడదని ప్రధాని భావించారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. అన్నింటికీ మించి, సంక్షేమ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం ఆశ్చర్యకరం. ప్రజల ఆరోగ్యం రక్షణపై శ్రద్ధ పెట్టడం ఒక సానుకూల పరిణామం. ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల ఆరోగ్య బీమా ప్రకటన పేద, మధ్య తరగతి వారికి ఊరటనిచ్చే విషయం. మహిళలకు కట్టెల పొయ్యి పొగ నుంచి విముక్తి కల్పించాలని అరుణ్ జైట్లీ నిర్ణయించారు. కోటిన్నర కుటుంబాలకు వంట గ్యాస్ అందిస్తామని ప్రకటించారు. బీపీఎల్ కుటుంబాల మహిళల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
నరేంద్ర మోడీ అంటేనే విద్యుత్ వెలుగులు గుర్తుకు వస్తాయి. గుజరాత్ ను 24 గంటలు కరెంటు సరఫరా చేసే తొలి రాష్ట్రంగా తీర్చి దిద్దిన తర్వాతే ఆయన ఖ్యాతి వ్యాప్తి చెందింది. ప్రధాని కావడానికి దారి చూపింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా గ్రామాలన్నింటికీ విద్యుత్ సరఫరా కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోంది. ప్రధానంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అయినా కేంద్రం అపారమైన చొరవ చూపుతోంది. గత 19 నెలల్లో మోడీ ప్రభుత్వం 5542 గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించింది. ఇదొక రికార్డు. 2018 కల్లా అన్ని గ్రామాలకూ విద్యుత్ సదుపాయం కల్పించడం తమ లక్ష్యమని జైట్లీ ప్రకటించారు.
కార్పొరేట్ వర్గాల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఇక విపక్షాలు విమర్శించే అవకాశం లేదంటున్నారు కమలనాథులు. యూపీఏ హయాంలో కూడా వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక రంగం, యువతకు స్కిల్ డెవలప్ మెంట్ వంటి రంగాలకు ఇంత భారీగా నిధులు కేటాయించలేదని పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు చెప్పారు. కొందరైతే జై జవాన్ జై కిసాన్ అని అభివర్ణించారు. హిందీతో యువతను నవ్ జవాన్ అంటారు. బడ్జెట్ లో యువతకు ప్రాధాన్యం ఇచ్చారనే ఉద్దేశంతో వారు ఆ వ్యాఖ్య చేశారు. అన్ని వర్గాల వారికీ బడ్జెట్ లో ఊరటే తప్ప పన్నుల బాధ లేదన్నది కమలనాథుల వాదన. అయితే, ఆదాయ పన్ను కనీస పరిమితికి పెంచి ఉంటే బాగుండేదని వేతన జీవులు అభిప్రాయపడుతున్నారు. ఇది మాత్రం పెద్ద లోటే.