తెలుగుదేశంలో జంప్ జిలానీ ఎమ్మెల్యేలకు మరిన్ని నజరానాలు ప్రకటించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది! తాజాగా కొన్ని నామినేటెడ్ పదవులు వారిలో కొందరికి ఇచ్చారు. మిగిలినవారికి కూడా ఏదో ఒక ప్రయోజనకం కల్పిస్తారట! నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి బయటకి వెళ్లారు. ఇంకోపక్క, పాదయాత్ర అంటూ విపక్ష నేత జగన్ కూడా ఎన్నికల మూడ్ తెచ్చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారులకు భరోసా కల్పించడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారంటూ టీడీపీ వర్గాలు చెబుతున్నారు. వీలైతే పదవులు, వీలు కాకపోతే ఇతర రూపాల్లో ప్రయోజనాలు కల్పించనున్నారు.
జంప్ జిలానీల త్యాగాలను ఎప్పుడో గుర్తించిన చంద్రబాబు.. ఓ నలుగురికి ఇదివరకే మంత్రి పదవులు ఇచ్చేశారు. మిగిలినవారికి మంత్రి పదవులు ఇవ్వలేకపోయినా, ఆ స్థాయిలోనే గుర్తింపు ఇస్తున్నారు. వైకాపా నుంచి టీడీపీలోకి వచ్చినవారిలో జ్యోతుల నెహ్రూ కూడా ప్రముఖులు. ఆయనకీ మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. కానీ, సామాజిక సమీకరణాల రీత్యా జ్యోతులకు పదవి దక్కలేదు. దాంతో ఆయన ఈ మధ్య అసంతృప్తిగానే ఉన్నారు. ఆయనకు నేరుగా పదవి ఇవ్వలేకపోయినా.. జ్యోతుల కుమారుడు నవీన్ కు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఛైర్మన్ తో రాజీనామా చేయించి మరీ జ్యోతుల కుమారుడికి అవకాశాన్ని ఇచ్చి, జ్యోతులను సంతృప్తి పరచారు! ఓపక్క నంద్యాల ఉప ఎన్నికల్లోనూ మైనారిటీ ఓట్లను ఆకర్షించడంలో ఉపయోగపడేలా నంద్యాల మైనారిటీ నాయకుడు నౌమౌన్ కి ఉర్దూ అకాడెమీ అధ్యక్ష పదవి ఇచ్చారు. పార్టీ మారిన దగ్గర నుంచీ తనకు తోచిన విధంగా జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్న జలీల్ ఖాన్ కూడా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఇచ్చారు.
తాజాగా పదవులు దక్కిన వారంతా చంద్రబాబు విషయంలో దిల్ ఖుష్ గా ఉన్నారట! ఆలస్యంగానైనా తమకు పార్టీలో మంచి గుర్తింపే లభించిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు మరికొంతమంది జంప్ జిలానీలకు కూడా త్వరలోనే వివిధ రకాల నజరానాలు అందబోతున్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఏరికోరి తెచ్చుకున్న వారికి సంతృప్తిపరచడం వరకూ బాగానే ఉంది. కానీ, ఫిరాయింపుదారులకు పదవులు ఇవ్వడం ద్వారా ఆయా ప్రాంతాల్లో టీడీపీ నేతలు అసంతృప్తి గురయ్యే అవకాశం పక్కాగా ఉంటుంది. అయితే, వారిని సంతృప్తి పరచడం అనేది కేంద్రం చేతిలోనే ఉంది! అదేనండీ.. నియోజక వర్గాల సంఖ్య పెంచడం! అది కూడా వీలైనంత త్వరగా జరిగేలా ప్రయత్నిస్తే నాయకులందరూ హ్యాపీ!
ఈ క్రమంలో గమనించాల్సి ఏంటంటే… నాయకుల అర్హతలు, నైపుణ్యాలను కొలమానాలుగా పెట్టుకుని ఇలాంటి కీలక పదవులను అప్పగించడం లేదు! కేవలం రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు, కులాల సమీకరణలు, ఓట్ మేనేజ్మెంట్ వంటి అంశాలనే ప్రమాణాలుగా పదవుల్ని కట్టబెడుతున్నారు. ఇంకా ఏవేవో ప్రయోజనాలను కూడా కల్పిస్తారట!