ఇది అభివృద్ధిని ప్రోత్సహించే బడ్జెట్ అనీ, పారిశ్రామిక ప్రగతికి పునాది అనీ, మధ్య తరగతి అనుకూలమనీ… ఇలా చాలా విశేషణాలతో రెండో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కొనియాడుతున్నారు భాజపా నేతలు. అయితే, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పడిపోయింది. నష్టాల్లో ముగిసింది. వివిధ రంగాల షేర్లు నష్టపోయాయి. అంటే, ఇది వాస్తవ రూపంలో ఆయా రంగాలు ఆశించిన విధంగా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. మొన్నటి ఆర్థిక సర్వేకీ, తాజా బడ్జెట్ కీ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదనేది నిపుణులు అంటున్నారు. ప్రముఖమైన ఆరోగ్యం, విద్య రంగాలకు పెద్ద భారీ కేటాయింపులు ఉంటాయని చాలామంది ఆశించారు. కానీ, అవేవీ దక్కలేదు.
గత ఎన్నికల్లో పెద్ద హామీ.. నల్లధన నియంత్రణ! దీనికి సంబంధించి ఈ బడ్జెట్లో పక్కాగా ఏదో ఒక విధానం ఉంటుందని ఆశిస్తే… దానికీ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎన్నికల ముందు రూ. 5 లక్షల వరకూ ఆదాయం పన్ను లేదని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో చెప్పారు. కానీ, ఆ పైన ఆదాయం ఉన్నవారికి రూ. 2. 5 లక్షల స్లాబ్ మీదే పన్నులు వర్తింపు చేశారు. కానీ, ఆ పరిమితిపై తాజా బడ్జెట్ లో ఎక్కడా ప్రస్థావన లేదు. పోస్టాఫీస్ సేవింగ్స్, సుకన్య పొదుపులు, పీఎఫ్… వీటిపై కూడా బడ్జెట్ లో ఎక్కడా ఎలాంటి ప్రస్థావన లేకపోవడం కొంత ఆశ్చర్యమే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇంతకు ముందు చెప్పారు కాబట్టి, దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ లో వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలకు భారీ కేటాయింపులు ఉంటాయని ఆశించారు. గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తారని అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత అంటూ ఏదీ దక్కని పరిస్థితి ఉంది.
చిన్న తరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం ఈ బడ్జెట్ లో ఉంటుందని ఆ రంగం వారు ఆశించారు. ఎందుకంటే, ప్రభుత్వం కూడా జీయో టేగింగ్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడం తప్పనిసరి చేసింది. ఓరకంగా ఈ రంగంలో కొంత పారదర్శకతను ప్రభుత్వమే తీసుకొచ్చిందని మెచ్చుకోవాలి. కాబట్టి, ఈ సెక్టార్ కి సంబంధించి పన్నుల విషయంలో కొంత ఊరట ఉంటుందని ఆశించారు. కనీసం ఓ ఏడాదిపైన అయినా ట్యాక్స్ హాలీడే లాంటిదైనా వస్తుందని అనుకున్నారు. కానీ, ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు బడ్జెట్ లో కనిపించలేదనేది నిపుణుల అభిప్రాయం. అన్నిటికీ మించి పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతూ బడ్జెట్లో ప్రకటించడం కూడా కొంత ఆశ్చర్యమే. ఎందుకంటే, పెట్రో ధరలు పెరగడం అనేది ఈ మధ్య ఓ నిరంత ప్రక్రియ అయిపోయింది కదా. కాబట్టి, కీలకమైన అన్ని రంగాలపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచిన దాఖలాలు బడ్జెట్ లో కనిపించలేదనేది నిపుణుల అభిప్రాయం.