హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఉద్యోగాల సృష్టి, మౌలిక వసతుల నిర్మాణం, పన్నుల నిబంధనల సరళీకరణ, స్టార్ట్-అప్లు, చిన్న వ్యాపారాలకు అనుకూల వాతావరణం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. హైవేలు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి రు.97,000 కోట్లు కేటాయించారు. వ్యవసాయరంగానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ప్రతి కుటుంబానికీ లక్ష రూపాయలకు ఆరోగ్య బీమా అందించటంతోపాటు, పేద కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్ ఇవ్వటానికి రు.2,000 కోట్ల నిధి ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు సిగరెట్లు, కార్లు, ఆభరణాలు, బొగ్గు తదితర వస్తువులపై పన్నులు పెంచారు. దీనితో ఇవన్నీ మరింత ప్రియం కానున్నాయి. ఆదాయపు పన్ను శ్లాబ్‌లను మాత్రం మార్చలేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతూ వ్యవసాయరంగానికి రు.36,000 కోట్లను కేటాయించారు. సేవల రంగంపై 0.5 శాతం సెస్ విధించటంతో సర్వీస్ ట్యాక్స్ 15%కి చేరనుంది. రెస్టారెంట్లలో భోజనాలు, వేయి రూపాయలపైన రెడీమేడ్ గార్మెంట్స్, బ్రాండెడ్ వస్తువులు, మినరల్ వాటర్, వ్యాపార ప్రకటనలు, విమాన ప్రయాణాలు, ఆర్కిటెక్ట్ సేవలు, గృహనిర్మాణం, క్రెడిట్ కార్డుల వాడకం, ఈవెంట్ మేనేజిమెంట్ తదితర సేవలు మరింత భారమవుతాయి. పాదరక్షలు, సోలార్ పంపులు, రూటర్స్, బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్స్, సెట్ టాప్ బాక్సులు, సీసీ కెమేరాలు, డయాలసిస్ పరికరాలు, శానిటరీ పాడ్స్, మైక్రోవేవ్ ఓవెన్స్ ధరలు తగ్గనున్నాయి.