ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.. నాణ్యమైన అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న మద్యం ధరను 99 నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
వాలంటీర్ వ్యవస్థపై మంత్రివర్గంలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. వాలంటీర్లను , సచివాలయలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 1.07లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని..ప్రస్తుతం 1.10లక్షల మంది వాలంటీర్లు మాత్రమే ఉన్నారని సీఎం చంద్రబాబుకు మంత్రులు వివరించారు. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని.. 2023లోనే వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదన్నారు. దీనిపై మరింత సమాచారం సేకరించాలని చంద్రబాబు మంత్రులను ఆదేశించారు.
దినపత్రికల కొనుగోలుకు ప్రతి నెలా ఇస్తోన్న 200రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సాక్షి పత్రిక కొనుగోలుకే వైసీపీ హయాంలో దినపత్రికల చందా ప్రవేశపెట్టారని మంత్రులు చంద్రబాబుకు వివరించారు. రెండేళ్ళలో దినపత్రిక చందా కోసం 200కోట్లకు పైగా ఖర్చు చేశారని దీంతో ఈ విషయంపై సమగ్ర విచారణకు కేబినెట్ ఆదేశించింది.
భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది. ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ.. స్టెమీ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆధార్ తరహాలో విద్యార్థులకు అపార్ గుర్తింపు కార్డులు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు మంత్రి పార్ధసారధి వివరించారు.
గత ప్రభుత్వం ఎస్ఆర్ఎం వర్సిటీని అనేక ఇబ్బందులకు గురి చేసిందని..వర్సిటీకి డీమ్డ్ వర్సిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఎస్ఆర్ఎం వర్సిటీకి డీమ్డ్ హోదా ఇస్తున్నట్లు వెల్లడించారు. వెయ్యి కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో బిట్స్ పిలానీ వర్సిటీకి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.