దేశంలో అనేక మంది యువతీ యువకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సరికొత్త ఆవిష్కరణలు, ఆలోచనలతో రకరకాల ఉత్పత్తులను లేదా సేవలను అందించేందుకు పరిశ్రమలు, సంస్థలు స్థాపించాలని కలలు కంటుంటారు. కానీ వారిలో చాలా మందికి ఆర్ధిక, సాంకేతిక సహకారాలు, అలాగే సమాజం, ప్రభుత్వాల సహకారం దొరకకపోవడంతో వారి ఆలోచనలు, ఆశయాలు, ప్రతిభాపాఠవాలు అన్నీ మరుగునపడిపోతుంటాయి. అటువంటి వారిని ప్రోత్సహించి వారికి అన్ని విధాల అండదండలు అందించేందుకు ప్రధాని నరేంద్ర మోడి గత ఏడాది గణతంత్ర దినోత్సవంనాడు “స్టార్ట్ అప్ ఇండియా స్టాండ్ అప్ ఇండియా” అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించేరు. దానిపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేసి విధివిధానాలు ఖరారు చేసిన తరువాత, ప్రధాని మోడి నిన్న దానిని తమ ప్రభుత్వం ఏవిధంగా అమలుచేయబోతోందో వివరించేరు. దానిలో ముఖ్యమయిన అంశాలు:
1.ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి ఒక మొబైల్ అప్లికేషన్ ప్రారంభించబడుతోంది. అనుమతులు, సహాయ సహకారాల కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగానవసరం లేకుండా ఆ మొబైల్ అప్లికేషన్ ద్వారా తమపేర్లను సులువుగా నమోదు చేసుకోవచ్చును.
2.ఈ కార్యక్రమం అమలుకోసం వివిధ ప్రభుత్వ శాఖలలో అవరోధంగా ఉన్న అనేక నియమ నిబంధనలను పక్కనపెట్టబడతాయి. అయితే కార్మిక మరియు పర్యావరణ శాఖల నియమ నిబంధనలకులోబడే తమ పరిశ్రమ లేదా సంస్థ పనిచేస్తుందని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఒక డిక్లరేషన్ ఫారం సమర్పించవలసి ఉంటుంది. దాని ఆధారంగా మూడేళ్ళ వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా ఆ సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చును.
3.దేశ వ్యాప్తంగా మొత్తం 13 స్టార్ట్ అప్ కేంద్రాలు, 18 టెక్నాలజీ బిజినెస్ ఇంక్యూబెటర్లు, 31 నూతన ఆవిష్కరణ ప్రయోగశాలలు (సెంటర్స్ ఫర్ ఇన్నోవేషన్స్) ఏర్పాటు చేయబడతాయి. ఇవి కాక దేశ వ్యాప్తంగా ఏడు పరిశోధనా (రీసర్చ్) పార్కులు, 50 బయో టెక్నాలజీ ఇంక్యూబెటర్లు, 150 టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కార్యాలయాలు, 20 బయో కనెక్ట్ కార్యాలయాలు ఏర్పాటు చేయబడతాయి. వాటిలో పాలుపంచుకొంటున్న ఔత్సాహికులకి మరింత ప్రోత్సాహం కల్పించేందుకు ప్రతీ ఏట జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్టార్ట్ అప్ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.
4.దీని కోసం కేంద్రప్రభుత్వం రూ. 10,000 కోట్లను కేటాయిస్తుంది. దానికి అధనంగా ప్రతీ ఏడాది రూ. 4,000 కోట్లను కేటాయిస్తుంటుంది. ఆ మొత్తం నుండి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమయిన ఆర్ధిక, సాంకేతిక సహాయ సహకారం అందుతుంది. ఇది కాక క్రెడిట్ గ్యారంటీ స్కీం క్రింద కేంద్రప్రభుత్వం ప్రతీ ఏటా రూ.500 కోట్లు మంజూరు చేస్తుంది.
5.అర్హులయిన వ్యక్తులకు దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇన్ క్యూబేషన్ సెంటర్లను వినియోగించుకోవచ్చును. అవసరమయితే అక్కడ వారికి తగిన శిక్షణ, ఆర్ధిక సహాయం కూడా ఇవ్వబడుతుంది.
6.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఈ ఇంక్యూబెటర్లు, కార్యాలయాలలో స్కూలు, కాలేజీ విద్యార్ధులు కూడా వినియోగించుకొని సరికొత్త ఆవిష్కారాలు చేసుకొనే అవకాశం కల్పించబడుతుంది. ప్రతీ ఏట మంచి ఆవిష్కరణలు చేసిన 20 మంది విద్యార్ధులకు మొత్తం రూ.10 లక్షలు బహుమానంగా అందజేయబడుతుంది.
7.నూతన ఆవిష్కరణలు చేసినవారికి దానిపై పేటెంట్ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం న్యాయనిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. సదరు ఉత్పత్తిపై పేటెంట్ హక్కులు పొందేందుకు అవసరమయిన న్యాయప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఆవ్యక్తికి దానిపై పేటెంట్ హక్కులు కల్పించడానికి ఆ కమిటీ అన్ని విధాల సహాయపడుతుంది. మొదటి సంవత్సరంలో ఈ స్టార్ట్ అప్ ఇండియా కార్యక్రమం క్రింద పేటెంట్ హక్కులు పొందేందుకు 80 శాతం ఫీజు రాయితీ ఇవ్వబడుతుంది.
8.ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరయినా వ్యక్తులు తమ స్థిరాస్తులను అమ్మగా వచ్చిన లాభంతో ఒక పరిశ్రమ లేదా సంస్థను ఏర్పాటు చేయదలచుకొంటే వారికి క్యాపిటల్ గెయిన్స్ పన్ను నుండి మినహాయింపు ఇవ్వబడుతుంది. మూడేళ్ళ వరకు ఆదాయపన్నుపై మినహాయింపు ఇవ్వబడుతుంది. అలాగే ఫెయిర్ మార్కెట్ ప్రైస్ పై కూడా మూడేళ్ళవరకు మినహాయింపు ఇవ్వబడుతుంది.
9.ఈ స్టార్ట్ అప్ ఇండియా కార్యక్రమంలో ఔత్సాహికులకు మరింత ప్రోత్సాహం కల్పించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవరోధాలను కూడా తొలగించి నిబంధనలను సరళీకృతం చేయబడతాయి. దీనిలో నమోదు చేసుకొన్న తరువాత 90 రోజులలోగా ఆశించిన ఫలితం పొందలేకపోతే ఎటువంటి ఇబ్బందీ లేకుండా తమ రిజిస్ట్రేషన్ న్ని రద్దు చేసుకోవచ్చును. అప్పుడు సదరు సంస్థకు చెందిన ఆస్తులను, వస్తువులను లేదా యంత్ర పరికరాలను ఆరునెలలలోగా అమ్మివేసి అప్పులు తీర్చివేసుకోవచ్చును.
10.ఈ స్టార్ట్ అప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా గరిష్టంగా రూ. 25 కోట్లు వరకు పెట్టుబడితో పరిశ్రమలు లేదా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చును.