మరో రెండేళ్లు గడిస్తే.. నా రాజకీయ జీవితం నలభయ్యేళ్లు పూర్తవుతుంది. ఇంత సుదీర్ఘకాలంలో నేనెన్నడూ తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి హింసాత్మక సంఘటన జరగడాన్ని చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తునిలో కాపు గర్జన అదుపు తప్పి.. హింసాత్మకంగా మారిపోయిన పరిణామాల పట్ల ఆదివారం రాత్రి 9 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సమావేశాలు పెట్టుకోవచ్చునని, అయితే ఇలాంటి హింసకు దిగడం సబబు కాదని అన్నారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల వారు కూడా.. సాధారణంగా ఎంతో సంయమనం పాటిస్తూ ఉంటారని, చాలా సానుకూల దృక్పథంతో ఉంటారని ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడే వారు కాదని చంద్రబాబునాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆందోళనకారులు 25 వాహనాలను, ఒక రైలును పూర్తిగా తగులబెట్టారని చెప్పారు. ప్రజలు భయాందోళనలకు గురై భీతిల్లిపోయారని అన్నారు. ఆందోళనను అదుపు చేయడానికి భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించామని.. పలువురు పోలీసులు గాయపడినప్పటికీ కూడా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిహింసకు దిగి, వ్యవహారం ముదరకుండా ఉండాలని పోలీసులకు ముందుజాగ్రత్త చర్యలుగా సూచించామని చంద్రబాబునాయుడు చెప్పారు.
కాపులను బీసీల్లో చేర్చడం, ఇతరత్రా ఆ కులస్తులకు న్యాయం చేసే విషయంలో తెలుగుదేశం చిత్తశుద్ధిని ఎవరూ తప్పుపట్టలేరని చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. అందుకోసం తాము ఇటీవల జారీచేసిన జీవోలను కూడా వివరించారు. తుని ఘటనను ప్రస్తావిస్తూ.. ఈ దుర్ఘటన బాధాకరం అంటూనే.. కొందరు రాజకీయనాయకులు ప్రజల్ని రెచ్చగొట్టి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని చెప్పారు. తుని ఘటన ఒక్కటే కాదని.. గతంలో పట్టిసీమ, అమరావతికి కూడ ఇలాగే అడ్డుపడ్డారని అనడం ద్వారా చంద్రబాబునాయుడు పరోక్షంగా ప్రధానప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ మీద అనుమానాలను వ్యక్తం చేశారు.
నిజానికి తెలుగుదేశం నాయకులు చాలా బాహాటంగా ఈ అల్లర్ల వెనుక.. వైకాపా గూండాలు ఉన్నారంటూ విమర్శలు గుప్పించడం జరిగింది. కాంగ్రెస్, వైకాపాలు కూడబలుక్కుని అల్లర్లకు కారణం అయ్యారంటూ వారు ఆరోపించారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం పేర్లు చెప్పకుండా వారి ప్రమేయం గురించి ఆరోపించడం విశేషం.