ఆంధ్రాలో వైకాపా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటోందో తెలంగాణాలో తెదేపా కూడా సరిగ్గా అటువంటి పరిస్థితులనే ఎదుర్కోవలసిరావడం విచిత్రం. ఆంధ్రప్రదేశ్ మీడియాలో నిత్యం వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి లేదా త్వరలో ఎవరెవరు పార్టీ వీడబోతున్నారనే వార్తలు కనిపిస్తుంటాయి లేదా ఆ వార్తలను ఖండిస్తూ వైకాపా ఎమ్మెల్యేల ప్రకటనలు కనిపిస్తుంటాయి. గత వారం రోజులుగా తెలంగాణాలో తెదేపా కూడా సరిగ్గా అటువంటి పరిస్థితులే ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ పార్టీలో కేవలం ముగ్గురే ఎమ్మెల్యేలు మిగిలారు. వారిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, సండ్ర వీరయ్య తెరాసలో చేరబోతున్నారని, ఆర్ కృష్ణయ్య స్వయంగా బీసీల కోసం పార్టీ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణా తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ కూడా తెరాసలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిని వారు ముగ్గురూ ఖండిస్తూ ప్రకటనలు చేయవలసి వస్తోంది. ఆర్. కృష్ణయ్య మొదటి నుంచి తెదేపాకు దూరంగానే ఉంటున్నారు కనుక ఆయన తెదేపాలో ఉన్నా లేనట్లుగానే అందరూ భావిస్తున్నారు కనుక ఆయన తెరాసలో చేరినా స్వంత కుంపటి పెట్టుకొన్నా తెదేపాకి సంబంధం లేదు కానీ తెలంగాణాలో ఇంకా తెదేపా ఉనికిని చాటుతున్న ఆ ముగ్గురు పార్టీని వీడి వెళ్లిపోతారనే వార్తలు తెదేపాకి ఇంకా నష్టం కలిగించవచ్చు.
ఆంధ్రాలో సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటున్న వైకాపాకి ఆ బాధ, నొప్పి రెండూ తెలుసు. అయినా దానికి చెందిన సాక్షి మీడియాలో తెలంగాణా తెదేపా నేతల ఫిరాయింపుల వార్తలు ప్రముఖంగా ప్రచురిస్తూనే ఉంది. ఆ నొప్పి, బాధ ఎలాగుంటుందో తెదేపాకి కూడా తెలిసిరావాలనే ఆ విధంగా చేస్తోందేమో?