హైదరాబాద్: రు.40 లక్షలకు పైనే పలికే మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, పోర్షె, జాగ్వర్, బెంట్లే కార్లు ప్రస్తుతం చెన్నైలో రు.2 లక్షలకు కాస్త అటూ ఇటూగా లభిస్తున్నాయి. కాకపోతే బ్రాండ్ న్యూ కార్లకూ, వీటికీ తేడా ఏమిటంటే ఇవి మొన్నటి చెన్నై తుపానులో కాస్త దెబ్బతిని ఉన్నాయి. రిపేర్ చేయటానికి వీలులేకుండా డేమేజ్ అయిన కార్లుగా ఇన్సూరెన్స్ కంపెనీలు వర్గీకరించిన ఈ రకం కార్లు ప్రస్తుతం చెన్నై నగరంలో దాదాపు 10,000 వరకు ఉన్నాయి. చెన్నై నగరంలో ఇలాంటివి మొత్తం 30,000 దాకా కార్లపై కస్టమర్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు క్లెయిమ్లు చేశారు.
రిపేర్ చేయటానికి వీలులేకుండా డేమేజ్ అయిన 10,000 కార్లను చెన్నై నగర శివార్లలో చెన్నై-బెంగళూరు హైవేపై కోరా ట్రక్ పార్క్లో ఉంచారు. వీటిని త్వరలో వేలంపాట ద్వారా అమ్మనున్నారు. కారు కంపెనీ, తయారీ సంవత్సరం, వర్షాలలో కారుకు జరిగిన నష్టం వంటి అంశాల ప్రాతిపదికన వేలం పాట నిర్వాహకులు వీటి ధరను నిర్ణయిస్తారు. హైఎండ్ లగ్జరీ కారును షోరూమ్ ధరలో కనీసం 40 శాతం తక్కువకు ఇక్కడ కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్ లైన్లో కూడా వేలం నిర్వహిస్తున్నారు. కావల్సినవారు copart.in, cardekho.com(auction division) సైట్లకు వెళ్ళి చూసుకోవచ్చు.