కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో క్షణక్షణానికి కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. అర్థరాత్రి రెండు గంటలుకు.. డైరక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేష్ అస్తానాలను సెలవుపై పంపి.. మన్నెం నాగేశ్వరరావుకు డైరక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. తనకు బాధ్యతలు అప్పగించిన వెంటనే.. సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు నిర్వహించారు. అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాల చాంబర్లను సీజ్ చేశారు. 13 మంది అధికారులను బదిలీ చేశారు. వీరిలో ఆస్థానా కేసు విచారిస్తున్న ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. అంతేగాక.. ఆస్థానాపై ప్రస్తుతం దర్యాప్తు సాగిస్తున్న బృందాన్ని తొలగించి కొత్త బృందాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఆస్థానా కేసును విచారించేందుకు తరుణ్ గోబా, సతీష్ దాగర్, వి. మురుగేశన్లతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేశారు. డీఐజీ తరుణ్ గోబా అంతకుముందు వ్యాపం కుంభకోణం కేసును దర్యాప్తు చేశారు.
ఎస్పీ సతీశ్ దాగర్ డేరా బాబా గుర్మీత్ రామ్ రహీం కేసును దర్యాప్తు చేయగా.. జాయింట్ డైరెక్టర్గా వి. మురుగేశన్ బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తు చేశారు. ఇక ఇప్పటివరకు ఆస్థానా కేసులో దర్యాప్తు చేస్తున్న డిప్యూటీ ఎస్పీ ఏకే బస్సీని ఉన్న పళంగా అండమాన్ కు బదలీ చేశారు.దానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ కారణంగా చూపించారు. నిజానికి పోర్ట్ బ్లెయిర్ లో ప్రత్యేకంగా సీబీఐ అధికారులంటూ ఎవరూ ఉండరు. తక్షణమే ఈ బదిలీలు, మార్పులు అమల్లోకి వచ్చినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. మరో వైపు ఉద్వాసనకు గురైన అలోక్ వర్మ..రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై పలు పత్రాలను సేకరించే ప్రయత్నంలో ఉన్నందు వల్లే ఆయనను పదవి నుంచి తొలగించారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
“రాత్రికి రాత్రే అలోక్ వర్మను దేశ కాపలాదారుడు పదవి నుంచి తొలగించారు. రఫేల్ ఒప్పందంపై ఆయన విచారణ జరుపుతారనే భయంతోనే ఈ పనిచేశారు” అని ఆరోపించారు. సీబీఐ సంచాలకుడు అలోక్ వర్మను ఎందుకు తొలగించారు? ఆయన కార్యాలయానికి ఎందుకు సీల్ వేశారు? ఏ విషయాన్ని దాచాలనుకుంటున్నారు?’ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించింది. మరో వైపు సీబీఐ ఇప్పుడు అతి తెలివి భాజపా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిపోయిందని.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఈ వివాదంపై చీఫ్ విజిలెన్స్ కమిషన్ స్పందించింది. అలోక్ వర్మ దర్యాప్తునకు సహకరించకపోవడం వల్ల సెలవుపై పంపామన్నది. మొత్తానికి సీబీఐ వివాదం.. దేశంలో రాజకీయ సునామీకి కారణం అవుతోంది.