‘ఎన్నికల తరువాత ఎన్డీయే గూటికే’ అంటూ వైకాపా పత్రిక సాక్షి ఒక కథనాన్ని అచ్చేసింది. దీని సారాంశం ఏంటంటే… ప్రస్తుతానికి భాజపాని వ్యతిరేకిస్తున్నా… ఎన్నికల తరువాత మళ్లీ మోడీతో దోస్తీ కట్టేందుకే టీడీపీ సిద్ధంగా ఉందనీ, లోపయికారీ ఒప్పందం చేసుకుందనేది నిరూపించే ప్రయత్నం చేశారు. ప్రత్యేక మిత్రుల ద్వారా భాజపాకి ఈ సమాచారం అందించారంటూ… ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు, భాజపా అధ్యక్షుడు అమిత్ షాల సమావేశానికి లింక్ పెట్టారు. కాంగ్రెస్ తోపాటు ఇతర రాజకీయ పార్టీల మద్దతు కొన్నాళ్లపాటు తప్పదూ… ఎందుకంటే, ప్రతిపక్ష నేత జగన్ ను ఎదుర్కొనాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అండ అవసరం అనే అభిప్రాయంతో టీడీపీ ఉందనీ, ఎన్నికలయ్యాక మళ్లీ మోడీకే మద్దతు ఇస్తామని చెప్పినట్టుగా రాశారు.
ఇదే నేపథ్యంలోనే, రఘురామ్ సిమెంట్స్ కి సంబంధించి కేసులో వైయస్ భారతిని చేర్చాలంటూ ఈడీ లీకులిచ్చిందని పేర్కొన్నారు! జగన్ ప్రతిష్టను ఎలాగైనా దెబ్బతియ్యాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగిందనీ, టీడీపీకి అనుకూలంగా భాజపా కూడా కేంద్రంలో ఈమేరకు మద్దతు ఇచ్చిందంటూ ఈ కథనంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా సాక్షి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే… భాజపాతో టీడీపీ కలిసే ఉందనీ, కేవలం జగన్ పై పోరాటం కోసమే ఎన్నికల ముందు కాంగ్రెస్ తో మిలాకత్ ఉంటుందని చెప్పడం..!
ఈ కథనంలో మిస్సైన లాజిక్కులు కొన్ని ఉన్నాయి! జగన్ ను ఎదుర్కోవడం కోసమే ఎన్నికల ముందు కాంగ్రెస్ సాయం కోసం చంద్రబాబు పాకులాడుతున్నట్టు రాశారు. ఆంధ్రాలో కాంగ్రెస్ కు అంత బలం ఉందనే సంగతి బహుశా ఆ పార్టీకి కూడా తెలీదేమో..! మహా అయితే ఓ పది సీట్లు వస్తే చాలు అనుకుంటోంది. కానీ, ఈ కథనంలో చూస్తుంటే… కాంగ్రెస్ కి బాగా బలమున్నట్టు, దాని కోసమే చంద్రబాబు అక్కున చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు రాశారు! నిజానికి, కాంగ్రెస్ కి ఏమాత్రం ఓటింగ్ పడినా… అది వైకాపా నుంచి చీలినవే అవుతాయి. ఆ బెంగ వైకాపాకి ఉంది కాబట్టే… కాంగ్రెస్ కి లేని బలంపై ఉన్నట్టుగా భుజాలు తడుముకుంటోంది.
ఇక, ఏడేళ్ల తరువాత భారతిని నిందితురాలిగా ఒక కేసులోకి చేర్చడాన్ని టీడీపీ, భాజపా కుట్రలో భాగమనే రాశారు. సరే, ఒకవేళ కేంద్రంలో అంతగా లాబీయింగ్ చేయగలిగే అవకాశమే ఉంటే… చంద్రబాబు చెప్పిన మాటను మోడీ షా ద్వయం వినే పరిస్థితి ఉంటే… కేవలం ఈ ఒక్క కేసు విషయమై మాత్రమే ఏదో ఒకటి చేయాలని ఎందుకు కోరతారు..? దాని కంటే, ఏ రైల్వేజోనో కడప స్టీల్ ప్లాంటో… లేదా ప్రత్యేక హోదా.. ఇలాంటిదేదో తెచ్చుకుంటే రాజకీయంగా వైకాపాని ఎదుర్కోవడం ఇంకా ఈజీ అవుతుంది కదా! ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. కేంద్రంలో చంద్రబాబు మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు… సాక్షి చెప్పిన ఆ ప్రత్యేక మిత్రులు కూడా కేవలం కేసుల గురించే ఎందుకు ప్రయత్నిస్తారు..?
ఇంకో పాయింట్ ఉంది..! ఎన్నికల తరువాత టీడీపీ ఎన్డీయే గూటికే అంటున్నారు, కానీ జగన్ ఒంటరిగా తట్టుకోలేకపోతున్నారు కాబట్టే, ఇతర పార్టీలను ఎన్నికల ముందు చంద్రబాబు సాయం కోరుతున్నారన్నారు! ఆంధ్రాలో టీడీపీ కంటే వైకాపాకే బలం పెరుగుతోందనుకున్నప్పుడు… టీడీపీని చేరదీయాల్సిన అవసరం భాజపాకి ఏముంటుంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైకాపాకి టీడీపీ కంటే 10 శాతం ఓట్లొస్తాయని ఈ మధ్య తేలిందని వారే రాశారు. అంటే, ఎన్నికల తరువాత బలమైన రాజకీయ శక్తిగా వైకాపా ఎదుగుతుంది. వారి లెక్క ప్రకారం ఎన్నికల తరువాత టీడీపీకి బలమే ఉండదు కదా! అలాంటప్పుడు భాజపా ఎందుకు వెంపర్లాడుతుంది..? ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల మధ్యలోంచి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశమే తప్ప… ఈ కథనంలో ప్రాక్టికాలిటీ కనిపించడం లేదు.