తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడురోజుల కిందట 119 నియోజకవర్గాలకు ఇంచార్జులను ప్రకటించారు. ఆ ఇంచార్జులెవరూ ఆయా నియోజకవర్గాలకు చెందిన వారు కాదు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇంచార్జులుగా నియమించారు. వారి పని… కేటాయించిన నియోజకవర్గంలో ఉండి పార్టీని బలోపేతం చేసి అక్కడ పార్టీ నిలబెట్టే అభ్యర్థిని గెలిపించడం. అంత వరకూ బాగానే ఉంది కానీ కింద షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా.. ఇలా ఇంచార్జులుగా ఉండే వారెవరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరు అన్న రూల్ కూడా పెట్టారు. దీంతో అందరూ ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు.
మాకు మా నియోజకవర్గంలో పదవి ఉంటే ఇవ్వడం లేకపోతే .. ఈ ఇంచార్జ్ పదవి కూడా వద్దని.. హైకమాండ్‌కు లేఖలు రాస్తున్నారు. దాదాపుగా అందరూ బండి సంజయ్ సన్నిహితులే. టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నవారే. తమ తమ నియోజకవర్గాల్లో పని చేసుకుంటున్నవారే. పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సయయంలో ఇలా పార్టీని గెలిపించాలి కానీ… పోటీకి దూరంగా ఉండాలంటే.. ఎలా అని వాపోతున్నారు. అందుకే తమకు ఇంచార్జి పదవులొద్దని లేఖలు రాస్తున్నారు.
అయితే బండి సంజయ్ మాత్రం… టిక్కెట్లు లేవని అనుకోవద్దని.. మీకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఆరు నెలలు పని చేయండని బుజ్జగిస్తున్నారు. ఆ తర్వాత సొంత నియోజకవర్గానికి పంపిస్తామంటున్నారు. అయితే ఈ ఆరు నెలల్లోనే ఇతరులు తమ తమ నియోజకవర్గాల్లో జెండా పాతేస్తారని అప్పుడు తామేం చేయాలని వారు మథనపడుతున్నారు. కానీ చేయగలిగిందేమీ లేదని చెబుతున్న బండి సంజయ్.. ఇప్పటికి సర్దుకుపోవాలని సలహా ఇస్తున్నారు. దీంతో ఆయా ఇంచార్జుల్లో నిర్వేదం ఏర్పడింది.