టాలీవుడ్ అగ్రకథనాయకులు ఇద్దరు.. కొద్ది రోజుల వ్యవధిలో… అన్వాంటెడ్ కారణాలతో మీడియాలో హైలెట్ కావాల్సి వచ్చింది. మొదటగా ప్రభాస్.. స్థలాన్ని రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పుకొచ్చారు. కానీ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు.. తన స్థలానికి సంబంధం లేదని ప్రభాస్ గట్టిగా వాదిస్తున్నారు. కోర్టులో పోరాటం ప్రారంభించారు. ఇప్పుడు వంతు మహేష్ బాబుది. ఎప్పుడో.. 2010లో నోటీసులు ఇచ్చామని.. ఇప్పటి వరకూ.. పన్నులు కట్టలేదని ఆరోపిస్తూ.. ఆయన రెండు బ్యాంక్ అకౌంట్లను జీఎస్టీ అధికారులు సీజ్ చేసేశారు. గొప్ప ఘనకార్యం చేసినట్లుగా మీడియాకు.. సమాచారం ఇచ్చారు. వెంటనే మీడియా కూడా..ఓ మసాలా న్యూస్ దొరికిందని… హైలెట్ చేసుకున్నారు.
ఇది ఇలా ఉండగానే.. ఢిల్లీలో… జీఎస్టీ అడిషనల్ కమిషనర్ టిప్‌టాప్‌గా తయారై మీడియా ముందుకు వచ్చారు. ఇంత వరకూ ఇలా ఏదైనా ఘటనలో ఐటీ, జీఎస్టీ అధికారులు.. ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చి.. చెప్పిన సంఘటనలులేవు. మహేశ్‌బాబుకు 2010లోనే నోటీసులు జారీ చేశామని జీఎస్టీ అడిషనల్ కమిషనర్ ఆనంద్ కుమార్ చెప్పుకొచ్చారు. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల పారితోషికాలపై సేవా పన్ను కట్టకపోవడంతో ఫైనాన్స్ యాక్ట్ 1994 సెక్షన్ 87 ప్రకారం రెండు బ్యాంక్ అకౌంట్లు జప్తు చేశామని చెప్పారు. వెంటనే… మహేష్ బాబు లీగల్ టీం స్పందించింది. మహేశ్‌బాబు చట్టానికి కట్టుబడి తన పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించారని ఆయన లీగల్ టీమ్ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది జీఎస్టీ కమిషనరేట్, హైదరాబాద్‌వారు కోర్టు పరిధిలో ఉన్న రూ.18.5 లక్షల పన్నుని వడ్డీతో కలిపి రూ.73.5 లక్షలు నిర్ణయించి బ్యాంకు ఖాతాల నిలుపుదలకు ఆదేశించారు. 2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను అంబాసిడర్ సర్వీసెస్‌కు ఈ పన్ను చెల్లించాలని వారు నిర్ణయించారు. వాస్తవానికి ఆ కాలంలో అంబాసిడర్ సర్వీసెస్ ఎటువంటి పన్ను పరిధిలోకి రాదు. అంబాసిడర్సర్వీసెస్ని పన్ను పరిధిలోకి సెక్షన్65 (105) ద్వారా 01-07-2010 నుంచి చేర్చారు. అని మహేష్ బాబు లీగల్ టీం చెబుతోంది.
పైగా ఈ విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉందనికూడా చెప్పుకొచ్చారు. మహేష్ లీగల్ టీం వాదన చూస్తే … నిజమేనని అనిపించకమానదు. ఎందుకంటే.. సర్వీస్ టాక్స్ లేని సమయంలో సర్వీస్ టాక్స్ ఎలా కడతారు..?. మొత్తంగా అటు ప్రభాస్.. తన స్థలానికి.. సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేదని చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తేనే అసలు విషయం తేలిపోతుంది. మరో వైపు… మహేష్ బాబు ఐటీ ఎగవేతదారు ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగుతుందో.. దీనికి వెనుక స్క్రీన్ ప్లే ఉందేమో… వాళ్లే బయటపెట్టాలి…!