సమగ్రమైన చర్చ ఏకాభిప్రాయ సాధన లేకుండా కేంద్రం గాని రాష్ట్రాలలో ప్రభుత్వాలు గాని రిజర్వేషన్లను రాజకీయ పాచికగా చేసుకోవడం వల్ల చాలా చోట్ల ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో కాపుల ఆందోళన తునిలో హింసాత్మకమైనా మొదట్లోనే సర్దుబాటయింది. ఇందుకు భిన్నంగా ఉత్తరాదిన జాట్ల ఆందోళనలో హింసాకాండ ఏకంగా 30 మంది ప్రాణాలు పోవడానికి ఇంకా అనేక అవాంఛనీయ ఘటనలకు కారణమైంది. వారి కోర్కెలను అంగీకరిస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర బిజెపి నేతలు వాటికి రాజ్యాంగ బద్దత ఏ మేరకు లభిస్తుందనేది పట్టించుకోవడం లేదు. దీనికి ముందు గుజరాత్‌లోన పటేళ్ల ఆందోళన చాలా ఉద్రిక్తత పెంచింది. గుజ్జర్ల డిమాండ్లు వుండనే వున్నాయి. ఇలాటి నేపథ్యంలో అటు అఖిలపక్షంతోనూ ఇటు న్యాయ నిపుణులతోనూ చర్చించి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించేబదులు ఏకపక్షంగా బిసిల ఆదాయ పరిమితి పెంచేందుకు సిద్ధమవుతున్నది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు సందర్భంలో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం క్రీమీ లేయర్‌ను నిర్ణయించాల్సి వచ్చినప్పుడు ఏడాదికి ఆరు లక్షల ఆదాయం కొలబద్దగా చేశారు. ఇప్పుడు దాన్ని 10 నుంచి 15 లక్షల వరకూ పెంచే యోచనలో కేంద్రం వుంది. అంటే ఇంచుమించు నెలకు లక్ష రూపాయలు ఆదాయం వున్న కుటుంబాల వారు బిసి రిజర్వేషన్లకు అర్హులవుతారన్న మాట. బిసి మైనార్టి కమిషన్లు గతంలోనే ఈ మేరకు పెంచాలని సిఫార్సులు చేసినట్టు ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. పెరిగిన జీవన వ్యయం ప్రకారం పరిమితి పెంచడం తప్పు కాకపోయినా అందరితో చర్చించి పెంచడం దాని పూర్వాపరాలు గమనంలో పెట్టుకోవడం చాలా అవసరం. అలాగే ఎస్సి ఎస్టిలు ఇప్పటికే వున్న బిసిలకు కూడా వివరించాల్సి వుంటుంది. అలా గాకుండా మేమే చేశామనిపించుకోవడానికి హడావుడి పడితే కొన్ని తరగతుల నుంచి వ్యతిరేకత రావచ్చు. అశాంతికి దారి తీయొచ్చు కూడా.