ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి అప్పులు చేయడం మాత్రమే కాదు.. అసలు ఆదాయం పడిపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. ఇసుక కొరత.. రాజధానిని నిలిపివేయడం వంటి వాటి వల్ల…ఆదాయం పడిపోయింది. అదే సమయంలో…కరోనా కారణంగాలాక్ డౌన్ వచ్చి పడింది. దీంతో అసలు ఆదాయం లేని పరిస్థితికి చేరిపోయిది. మూడు నెలల తర్వాత అన్‌లాక్ నిబంధనలు అమలు చేయడం ప్రారంభించారు. దాంతో.. మిగిలిన రాష్ట్రాలు ఆర్థికంగా తేరుకుంటున్నాయి. గతంలోలా కాకపోయినా… మెరుగైన ఆదాయాన్ని చూస్తున్నాయి. కానీ ఏపీ మాత్రం… ఏ మాత్రం కోలుకుంటున్న దాఖలాలు లేవు.
ఆగస్టు నెలలో తెలంగాణకు రూ. పదమూడు వేల కోట్ల వరకూ ఆదాయం వచ్చిందంటే.. మామూలు విషయం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆదాయం.. రూ. మూడు వేల కోట్లకు అటూ ఇటూగానే ఉంది. ఇలా ఎందుకు జరుగుతుందో.. ప్రభుత్వం విశ్లేషించుకుంటుందో లేదో … ఎవరికీ అర్థం కావడం లేదు. ఏపీలో రోజుకు పది వేల కేసులు నమోదవుతున్నప్పటికీ.. ఎక్కడా లాక్ డౌన్ అమలు చేయడం లేదు. వ్యాపార, నిర్మాణ కార్యకలాపాలాన్నింటినీ యథావిధిగా అనుమతులు ఇచ్చారు. జరిగేవి జరుగుతున్నాయి. మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కానీ.. ఏపీ సర్కార్ ఆదాయం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటోంది.
ప్రతి రాష్ట్రానికి ఇన్కంఇంజిన్ ఒకటి ఉంటుంది. అది ప్రధానంగా మెట్రో సిటీలే అయి ఉంటాయి. ఆయా నగరాల నుంచి వచ్చే ఆదాయం.. ఆయా రాష్ట్రాలకు ఆర్థిక ఆయువుపట్టుగా ఉంటుంది. తెలంగాణకు హైదరాబాద్… కర్ణాటకకు బెంగళూరు. ..తమిళనాడుకు చెన్నై ఇలా ఉన్నాయి. ఇలాంటి మెట్రో సిటీలు లేని గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పారిశ్రామికరంగం విపరీతమైన వృద్ధిని నమోదు చేసింది. వాటి ద్వారా ఆదాయం వస్తుంది. కానీ ఏపీలో అలాంటి మెట్రో సిటీ కానీ.. ఆదాయం తెచ్చే పారిశ్రామికం కానీ లేదు. ఇలాంటి సమయంలో… పడిపోయిన అర్థిక వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలంటే.. సరైన వ్యూహం అవసరం. ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా… విధానాలు రూపొందించాలి. ఏపీ సర్కార్ అలాంటి విధానాల వైపు దృష్టి సారించడం లేదు. దాంతో.. ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఈ విషయం ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతోనే తేటతెల్లమవుతోంది.