హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ అధికారులు మరోసారి గురి పెట్టారు. ఈ సారి ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో వందల కోట్లు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్న కంపెనీలపై విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. అన్విత బిల్డర్స్ అనే కంపెనీ ఇటీవల భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. ప్రిలాంచ్ పేరుతో వసూళ్లు చేస్తోంది. ఈ కంపెనీకి సంబంధించిన ఆఫీసులు, ఓనర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
సింగపూర్, దుబాయ్లో ఇంటీరియర్ బిజినెస్ ద్వారా బొప్పన అచ్యుతరావు గుర్తింపు పొందారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. అన్విత బిల్డర్స్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. బాచుపల్లి లో భువి రెసిడెన్సీ పేరుతో 2021లో ఓ ప్రాజెక్ట్ నిర్మించారు . తర్వాత వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించారు. మొత్తం నాలుగు భారీ ప్రాజెక్టులు చేపట్టింది. మొత్తం 60 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టింది. ఇవన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. కానీ, ప్రీలాంచ్ పేరుతో ముందుగానే డబ్బులు వసూలు చేసింది.
రూ.2వేల కోట్ల మెగా ప్రాజెక్ట్ కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రీలాంచ్ పేరుతో కొంత వసూళ్లు చేసినా ఇంకా ఇతర ప్రాజెక్టుల్లోనూ భారీగా పెట్టుబడులు పెడుతోంది. త్వరలో నీలాద్రి ఫామ్స్ పేరుతో ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్నూ చేపడుతున్నట్టు చెప్పింది. దీంతో ఐటీ శాఖ దృష్టిలో పడింది. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులకు నగదుతో పాటు పన్నులు ఎగ్గొడుతున్న వైనంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దాడులు ఆ కంపెనీల యాజమాన్యంతో పాటు ప్రిలాంచ్ ఆఫర్లలో డబ్బులు కట్టిన వాళ్లకూ ఆందోళన కలిగించాయి. తమకు ఎలాంటి సమస్యా రాకూడదని.. ఆ ప్రాజెక్టులకు ఇబ్బంది ఉండకూడదని వారు కోరుకుంటున్నారు.