ఢిల్లీ ప్రభుత్వంతో ఇటీవల సోనూసూద్ ఓ “దేశ్ కే మెంటార్స్” కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఒప్పుకున్నారు. అలాగే పంజాబ్ ప్రభుత్వానికి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా వరుసగా బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలతో అసోసియేట్ అవుతున్నప్పుడే చాలా మంది నెక్ట్స్ సోనూ సూద్ వంతే అని అనుకున్నారు. అది ఇప్పుడు వాస్తవంలోకి వచ్చింది. సోనూసూద్‌కు చెందిన ఇళ్లు ఇతర కార్యాలయాలపై ఐటీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేశారు. ముంబైలో ఆయనకు ఇల్లుతో పాటు ఓ హోటల్ ఉంది. అలాగే కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి.
వాటన్నింటిపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆదాయ వివరాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా సమయంలో విపరీతంగా సహాయ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సోనూసూద్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రశంసలు లభించాయి. ఓ సమయంలో ఆయన బీజేపీ ఏజెంట్ అని శివసేన మండిపడింది. ఆ తర్వాత ఆయన నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.
ఎప్పుడూ రాజకీయాల జోలికి సోనూసూద్ వెళ్లలేదు. అయితే బీజేపీ మాత్రం అలా అనుకున్నట్లుగా లేదు. త్వరలో పంజాబ్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆప్ ప్రభుత్వంతో జట్టు కట్టడం రాజకీయ అడుగేనని అనుకున్నారేమో కానీ ఐటీ దాడులు ప్రారంభించినట్లుగా భావిస్తున్నారు. సోనూసూద్ పంజాబ్‌కు చెందిన వ్యక్తి. బీజేపీతో ఎవరు విబేధించినా వారిపై ఐటీ, ఈడీ, సీబీఐ లాంటివి దాడులు చేయడం గత ఏడేళ్ల కాలంలో జరుగుతూనే ఉంది. అందుకే సోనుసూద్ పై ఐటీ దాడుల విషయంలోనూ అదే తరహా ప్రచారం జరుగుతోంది.