ఎపి తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ సీట్ల పెంపు వుంటుందా లేదా అనేది ఇప్పటికీ అనిశ్చితంగా వుంది. పెంపు జరగదని దాదాపు తేలిపోయినా అప్పుడప్పుడు ఆశపెట్టడం ఇందుకు కారణం. తెలంగాణ ఎంపి డా.బూరనర్సయ్య గౌడు తాజాగా ఇదే సమస్య లేవనెత్తారు. ఎపిలో నైతే కాస్త వేడి పెరిగినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీట్లపెంపు అవకాశాలు చెబుతుంటారు. బిజెపి స్వంత బలం పెరక్కుండా సీట్ట పెంపు వద్దని అద్యక్షుడు అమిత షా ఆపుతున్నారని ఆ పార్టీ వారు చెబుతుంటారు. అయితే ఇప్పుడు అడ్డుకోవడం గాక పెంచడమే మంచిదని వారు కూడా చెబుతున్నారట. కాకపోతే దానికో మెలిక పెట్టారు. ఈ పెంచే సీట్లలో కనీసం సగమైనా తమ పార్టీ వారికి ఇచ్చేందుకు టిడిపి అధినేత ముందే ఒప్పుకోవాలట. ఒకసారి ఒప్కుకుంటే ఆయనే ఎన్నికల ఖర్చులు కూడా పెట్టుకుంటారట. ఇది బిజెపిలో కొందరి లెక్క. ఇందుకు పూర్తి భిన్నంగా సోము వీర్రాజు వంటి వారు చేతనైతే తెగతెంపులు చేసుకొమ్మని సవాళ్లు విసురుతుంటారు. దీనికి స్పందించే వైబిరాజేంద్రప్రసాదు వంటి వారిని చంద్రబాబు మందలిస్తుంటారు. ఆచితూచి అడుగేయాలని, తమ వైపు నుంచి ఎలాటి కవ్వింపు చర్యలు మాటలు వుండకూడదని ఆయన అనుకుంటున్నారట.కాని ఆ పార్టీ నాయకులకు మాత్రం బిజెపి వైఖరి చిర్రెత్తిస్తున్నది. అలాగే టిడిపి తమను ఉపేక్షిస్తున్నదని బిజెపి నేతలకు చిరాకు తెప్పిస్తున్నది.