తెలంగాణలో బీర్ల ధర పెరగబోతుందా…? ఈ మేరకు రాష్ట్ర బేవరేజ్ కార్పోరేషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుందా…? బీర్లు తయారు చేసే కంపెనీలకు పెంచిన ధరలను వినియోగదారులపై వసూలు చేయబోతున్నారా….?
ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తోంది. కరోనా సమయంలో తెలంగాణలో మద్యం రేట్లు పెంచింది అప్పటి కేసీఆర్ సర్కార్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు రేట్లు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బేవరేజేస్ కార్పోరేషన్ బీర్ తయారు చేసే కంపెనీలకు 10-12శాతం రేటు పెంచి ఇవ్వబోతుంది. పెంచిన రేటును ప్రభుత్వంపై భారం పడకుండా వినియోగదారుల నుండి వసూలు చేసే అవకాశం ఉంది.
Also Read : ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నయా ప్లాన్ ?!
12 బాటిల్స్ ఉండే ఒక్కో కేసుకు ప్రభుత్వం తరఫున బేవరేజేస్ కార్పోరేషన్ 289రూపాయలను కంపెనీలకు చెల్లిస్తుంది. కార్పోరేషన్ నుండి వైన్స్ షాప్స్ కు ఒక్కో కేసు 1400రూపాయలకు విక్రయిస్తే, మందుబాబులకు 1800కేసు అమ్ముతున్నారు. అంటే ప్రభుత్వం ఒక్కో బీరును 24రూపాయలకు కొని ప్రజలకు ఏకంగా 150రూపాయలకు అమ్ముతున్నట్లు లెక్క.
మద్యం సరఫరా చేసే కంపెనీల నుండి రాష్ట్ర బేవరేజేస్ కార్పోరేషన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటుంది. గడువు ముగిసేలోపు రెన్యూవల్ చేయటం ఆనవాయితీ. ఇప్పుడు గడువు ముగింపుకు రావటంతో తమకు ఇచ్చే మద్యం రేట్లను సవరించాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
కార్పోరేషన్ ఆలోచనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… సెప్టెంబర్ నుండి బీర్ల రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.