చంద్రయ్య అనే వ్యక్తిని నడి ఊరులో కోడిని కోసినట్లుగా నలుగురు పట్టుకుని పీక కోసేశారు. ఈ దృశ్యాలు చూసిన ఎవరైనా మనం ఏ సమాజంలో ఉన్నామో అని ఒళ్లు జలదరించుకోక తప్పదు. ప్రొద్దుటూరులో నందం సుబయ్య అనే వ్యక్తిని ఓ అధికారి ఫోన్ చేసి పిలిపిస్తే ఓ పక్క ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూంటే మరో పక్క పీక కోసి చంపేశారు. ఈ ఘటన చూసి ఇదేం రాజ్యం అనుకున్న వాళ్లు ఉంటారు. కానీ ఏపీలో ఇప్పుడు అలాంటివి జరగకపోతేనే ఆశ్చర్యపోతున్నారు. అవన్నీ మా రాష్ట్రంలో కామన్ అనుకునే పరిస్థితి వచ్చింది. ఎంతగా అంటే… వివేకా హత్య కేసులో వేగం పెంచాలని విచారణ నిలిపివేసినప్పుడు ఢిల్లీ వెళ్లి సీబీఐ అధికారుల్ని సునీత అడిగితే… అక్కడ మనుషుల్ని నరుక్కోవడం, చంపుకోవడం కామనేగా అన్నట్లుగా మాట్లాడారు. ఈ విషయం చెప్పుకుని సునీత కూడా బాధపడ్డారు.
అంటే ఏపీలో పాలన ఏ స్థాయి నుంచి ఏ స్థాయి ఘోరాలకు దిగజారిపోయిందో అంచనా వేయవచ్చు. మనుషుల ప్రాణాలకు విలువ లేదు. ఆస్తులకు రక్షణ లేదు. వైసీపీ నేతలయితే ఎంతటి ఘోరాలయినా చేసి నిరభ్యంతరంగా తిరగవచ్చు. వైసీపీ నేతల కన్నుపడిన ఆస్తల్ని లాగేసుకోవచ్చు. పరిస్థితి ఎలా మారిందంటే.. ఏ రోజైనా ఎక్కడ ఘోరం జరగకపోతే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ప్రజల జీవన విధానాన్నిపూర్తిగా ప్రభావితం చేసి వారిని జీవితాల్ని భయాందోళనలకు మార్చేశారు.
ఏ రాష్ట్రంలో అయినా ప్రజలు ప్రశాంత జీవనాన్ని కోరుకుంటారు. అది ప్రభుత్వం సమర్థత. ప్రజలకు ఇవ్వాల్సిన గ్యారంటీ. బటన్లు నొక్కుతారా.. రోడ్లు వేస్తారా అన్న సంగతి పక్కన పెడితే.. లా అండ్ ఆర్డర్ ప్రకారం ప్రజల జీవితాలకు భద్రత కల్పించడం ముఖ్యం. కానీ ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తేనే తాము చెప్పినట్లుగా వింటారని పాలకుల మనస్థత్వానికి తగ్గట్లుగానే వారి అనుచరగణం, వంది మాగధులు రెచ్చిపోతున్నారు. వైసీపీ పార్టీలో ఏ స్థాయిలో చూసినా నేరాలకు తగ్గ పదవి ఇస్తారు. విజయవాడలో ఓ పిక్ పాకెటర్ కార్పొరేటర్ అంటే నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఏలూరు పరిధిలో ఉన్న కార్పొరేటర్లంతా క్రిమినల్సే.
ఇలా ప్రతీ స్థాయిలో నేరుస్తుల్ని మాత్రమే నాయకత్వంగా ఎంచుకుంటూ.. వైసీపీ పాలన సాగుతోంది. చివరికి అది ప్రజలకు పెనుముప్పుగా మారింది. ఎప్పుడు ఎవరింటిపైకి వీళ్లు ఎగబడతారో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఘోరాలు జరగని రోజును చూసి హమ్మయ్య అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.